Amit Shah Hindi Issue:ఇంగ్లీషు బదులు హిందీనే వాడుదాం..అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!

ఇంగ్లీషుకు బదులుగా హిందీనే ప్రోత్సహిద్దాం అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన కామెంట్స్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

  • Written By:
  • Updated On - April 12, 2022 / 11:37 AM IST

ఇంగ్లీషుకు బదులుగా హిందీనే ప్రోత్సహిద్దాం అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన కామెంట్స్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అసలు అమిత్ షా ఏమన్నారంటే…హిందీ భాషను ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా అంగీకరించాలని ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా అన్నారు. ఇంగ్లీషుకు స్థానిక భాషలు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేది అధికార భాషే అని ప్రధానమంత్రి మోదీ నిర్ణయించారన్నారు. ఈ మేరకు హిందీ భాషకు మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేబినెట్ లోని 70శాతం ఎజెండాలు హిందీలోనే సిద్ధమవుతున్నాయని తెలిపారు. భారతదేశ ఐఖ్యతలో అధికార భాష హిందీ కూడా ఒక భాగం కావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక భాషలు కాకుండా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని తప్పక అంగీకరించాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.

ఇతర భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైందిగా మారుస్తారు కానీ ప్రచారం చేయరాదన్నారు. పలు భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో మరొకరు మాట్లాడుతున్నప్పుడు అది భారతీయ భాషలోనే ఉండాలని షా అన్నారు. స్ధానిక భాషల పదాలను హిందీలోకి మార్చుకుని…హిందీని మరింత అనుకూలంగా మార్చాలని సూచించారు. 9వ తరగతి విద్యార్థులకు హిందీ ప్రాథమిక పరిజ్ణానాన్ని అందించాలని…హిందీ బోధన పరీక్షలపై మరింత శ్రద్ద చూపించాల్సిందేనని నొక్కి చెప్పారు.

అయితే హిందీని భాష గురించి కేంద్ర హో మంత్రి ప్రతిపాదించిన తీరు కొత్త వివాదానికి దారి తీసినట్లయింది. ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో మరొకరు మాట్లాడుకునేప్పుడు అది భారతీయ భాషలోనే ఉండాలని అమిత్ షా చెప్పడంతో చర్చ షురూ అయ్యింది. స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా…ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని తెలిపారు. దీనిపై కొందరు జాతీయ భాష విమర్శకులు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు.

ఇకజాతీయ భాష, దేశంలోని భాషా గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. 1973లో మద్రాసులో కాంగ్రెస్ హిందీని తప్పనిసరి చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు హింసాత్మక నిరసనలు జరిగాయి. 1965లో విద్యార్థులు ఊరేగింపులకు నాయకత్వం వహించి…ఆత్మహుతి చేసుకున్న సందర్భంలో మరోసారి ఆందోళనకు తెరలేసింది.

1946 నుంచి 1950వరు ద్రవిడర్ కజగం, పెరియార్ ఈవీ రామస్వామి హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సర్కారు బడుల్లో హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టినప్పుడల్లా హిందీ వ్యతిరేక నిరసనలు తమిళనాడులో జరిగాయి. 1948 నుంచి 1950 వరకు హిందీ వ్యతిరేక ఆందోళనలు చాలా పెద్దగా జరిగాయి. 1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత…పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని అన్ని రాష్ట్రాలను అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. చివరికి ప్రభుత్వం 1950లో హిందీ బోధనను ఐచ్చికం చేసింది. హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడని విద్యార్థులు హిందీ తరగతుల సమయాల్లో ఇతర పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనేలా అనుమతులు ఇఛ్చింది. ఇక పార్లమెంటరీ అధికార భాషా కమిటి 37వ సమావేశంలో కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషల గొడవను మళ్లీ రాజకీయంగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.