Bhogi : భోగిని ఎందుకు జరుపుకుంటాం..? దానివెనుక ఉన్న పురాణ కథలు తెలుసా?

భోగి అనే పదం.. భుగ్ నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం.. శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని..

  • Written By:
  • Publish Date - January 14, 2024 / 05:00 AM IST

Bhogi : దేశమంతా కలిసి చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మూడురోజుల పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు సిటీల్లో ఉన్నవారి నుంచి దేశ, విదేశాల్లో ఉన్నవారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. ప్రాంతాల సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకునే సంక్రాంతి.. పేర్లు వేరైనా పండుగ ఒక్కటే. ప్రతిఏటా పుష్యమాసం బహుళ పక్షంలో వచ్చే ఈ మూడురోజుల పండుగలో తొలిరోజును భోగి పండుగగా జరుపుకుంటారు. ఉదయాన్నే భోగిమంట వేసి.. ఆ మంటల్లో పాతవస్తువులను పడేస్తారు. ఆ మంటల్లో కాచిన నీటితో స్నానాలు ఆచరిస్తారు. అసలు భోగి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.

భోగి అనే పదం.. భుగ్ నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం.. శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. అందుకు సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. పురాణాల్లో మరోకథనం ప్రకారం.. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగిరోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్థన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజుకూడా భోగి రోజునే అని పెద్దలు చెబుతున్నారు. అలాగే.. పరమేశ్వరుడు తన వాహనమైన నందీశ్వరుడిని రైతుల కోసం భూమ్మీదికి పంపిన పవిత్రమైన రోజుకూడా భోగిరోజే. అందుకే భోగి పండుగను జరుపుకుంటారు.

భోగి రోజున భోగిమంటలు వేసి.. అసలైన భోగాన్ని కలిగించమని, అమంగళాలు తొలగించాలని అగ్నిని పూజించి, అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను కోపతాపాలను, అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడం భోగిమంట పరమార్థం. ఇంట్లో అందరూ వేకువజామున లేచి.. ఇంటి ముందు భోగిమంట పరమార్థం. ఆవు పిడకలు, నెయ్యి వేసి భోగిమంటలు రాజేసి.. అప్పటికే సిద్ధం చేసుకున్న తాటిఆకులు, కర్రముక్కలు, ఇంట్లో పాడైన చెక్క కుర్చీలు వగైరాలన్నీ అందులో వేస్తారు. ఇలా ఇంట్లోని పనికిరాని వస్తువులను భోగిమంటల్లో వేసి.. తమ దారిద్య్రం తొలగిపోతుందని, దక్షిణాయనకాలంలో ఎదుర్కొన్న కష్టాలకు వీడ్కోలు చెప్పి.. ఉత్తరాయణం శుభాలను మోసుకొస్తుందని భావిస్తారు.