Site icon HashtagU Telugu

Southern Cinema: ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దక్షిణాది సినిమా

Southern Cinema

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

By: డా. ప్రసాదమూర్తి

Southern Cinema: సినిమా (Southern Cinema)లో కేవలం ఒక హీరో మాత్రమే ఉంటాడు. కానీ అనుకోకుండా సంభవించే ప్రకృతి ప్రళయం, ప్రతి మనిషినీ ఒక హీరోని చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ఒక సినిమా ఇప్పుడు ఆస్కార్ గెలుపు వాకిట నిలుచుని ఉంది. 2018: ఎవరి వన్ ఈజ్ ఏ హీరో(2018: everyone is a hero) అనే మలయాళీ సినిమా 96వ ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది. గత నాలుగేళ్లలో ఆస్కార్ అవార్డు కోసం ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభించిన మూడో సినిమా ఇది. 2021లో జల్లికట్టు, 2022లో పెబుల్స్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాయి. 2018 కేరళ వరదల బీభత్సాన్ని తెరకెక్కించిన సినిమా ఇది. అందుకే దీనికి 2018 అని పేరు పెట్టారు.

ప్రతి ఒక్కరూ ఒక కథానాయకుడే (ఎవరి వన్ ఈజ్ ఎ హీరో) అని సినిమాకి ఒక ఉపశీర్షిక ఉంచారు. ఇప్పటివరకు ఇండియా నుంచి 56 సినిమాలు ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీపడ్డాయి. వాటిలో కేవలం 15 సినిమాలు మాత్రమే ఇప్పటివరకు ఎంపిక అనే లక్ష్మణ రేఖను దాటగలిగాయి. వీటిలో చాలా సినిమాలు ప్రాంతీయ భాషల్లో తీసినవి. అవి ఆ రాష్ట్రాలను దాటి బయట ప్రపంచం ప్రేక్షకులను ఆకట్టుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఈ మధ్యనే భారతీయ భాషల్లో దక్షిణాది సినిమా, ఇటు దేశవ్యాప్తంగానూ అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకాదరణ పొందడం మొదలైంది. ఇప్పుడు ఈ మలయాళీ సినిమా 2023 ఆస్కార్ కోసం పోటీకి నిలబడింది. ఓటిటిలో అందుబాటులో ఉంది. అద్భుతమైన సన్నివేశ చిత్రీకరణ, గుండెలు ఉగ్గబట్టే వరద బీభత్స దృశ్యాలతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా భాష, ప్రాంతం, దేశం అనే అవరోధాలను దాటుకొని ప్రపంచ సినీ జగత్తును ఆకట్టుకుంటుందన్న గట్టి నమ్మకాన్ని మనకు కలిగిస్తోంది.

దక్షిణాది భాషల్లో వచ్చిన సినిమాలు ఆ భాషా ప్రేక్షకులను తప్ప దేశంలో ఉత్తరాది ప్రాంతాల వారిని కూడా ఒకప్పుడు చేరే అవకాశం ఉండేది కాదు. కేవలం భాష అనే అడ్డంకి మాత్రమే కాదు. సినిమాకు కావలసిన మార్కెటింగ్ నైపుణ్యం, సినిమా నిర్మాణంలో కావలసిన తగిన పెట్టుబడి, ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయాలన్న తపనలో లోపం.. ఇలాంటి అనేక కారణాలతో దక్షిణాది సినిమా ఇటీవల కాలం వరకు దేశంలోనే మరో ప్రాంతానికి చేరుకునేది కాదు. కానీ ఇప్పుడు ఆ సీను మారింది. బాహుబలి, దృశ్యం, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప మొదలైన సినిమాలు సొంత భాషల్లో బాక్సాఫీసులు బద్దలు కొట్టడమే కాకుండా భారతీయ భాషల్లో, ముఖ్యంగా హిందీలో కూడా అద్భుత విజయాలు నమోదు చేసుకున్నాయి. దీనితో అందరి చూపు దక్షిణాది సినిమా మీద పడింది.

సొంత రాష్ట్రం దాటి బయటకు వెళ్లడానికి సరైన అవకాశాలు కూడా ఇంతకుముందు ఉండేది కావు. ఇప్పుడు దక్షిణాది సినిమాలను ఏ భాష వారైనా ఆదరిస్తారు అనే నమ్మకం మనవారికి గట్టిగా కుదిరింది. దీంతో కమర్షియల్ సినిమాలతో దీటుగా మంచి మానవీయ, పర్యావరణ, సామాజిక ఇతివృత్తాలతో దక్షిణాదిన సినిమాలు తీసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ సినిమాలు తీయడమే మూడు నాలుగు భాషలలో ఒకేసారి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. దీనితో ఇతర భాషల వారు కూడా ఈ సినిమాలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు మనదేశంలోనే దాదాపు 20-30 ఫిల్మోత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో అన్ని భాషల సినిమాలూ ప్రదర్శనకు నోచుకుంటున్నాయి. అలా ఒక భాష లో పుట్టి, మరో భాషా ప్రాంతంలో ప్రదర్శించబడి, గొప్ప సృజనాత్మకత, కళాత్మక విలువలు ఉన్న సినిమాలు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగలవని నిరూపించుకుంటున్నాయి.

Also Read: Varun Tej Wedding : వరుణ్ తేజ్ వివాహ ముహూర్తం ఫిక్స్ ..

We’re now on WhatsApp. Click to Join.

2023 కి గాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI) ఆస్కార్ సెలక్షన్ కమిటీ 22 సినిమాలను స్క్రీన్ చేసింది. వీటిలో మన తెలుగు సినిమా బలగం కూడా ప్రదర్శింపబడింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాతో పోటీపడి ఇండిపెండెంట్ సినిమా నిలదొక్కుకుంటున్న కాలమిది. తెలుగు సమాజాన్ని ఊళ్లకు ఊళ్లే కలిసి చూసేటట్టు చేసిన బలగం సినిమా ఇప్పుడు భారతదేశంలోనే కాదు, స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో సహా అనేక దేశాల చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడుతోంది. తాజాగా దీని గురించి ఈ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి మాట్లాడుతూ, భాషా సంస్కృతులు వేరువేరైనా మానవ సంవేదనలు ఎక్కడైనా ఒకటేనని, ఏ సమాజం వారైనా కథతో కనెక్ట్ అవుతారని అన్నారు. నిజమే మానవ జీవితం ఎక్కడైనా ఒకటే. మానవీయమైన సామాజికమైన కోణాలు ఎక్కడైనా ఒకటే. పర్యావరణం ఎక్కడైనా ఒకటే. వీటిని పునాదిగా చేసుకుని వచ్చే సినిమాలకు భాష ఒక అవరోధం కాదు. దాన్ని అధిగమించి ప్రపంచంలో ఏ మూలనైనా సినిమాను ప్రజలు ఆదరిస్తారని వర్తమాన విజయాలు చెబుతున్నాయి.

ప్రపంచ మార్కెటును ఆకర్షించడానికి చాలా హంగులు, ఆర్భాటాలు కావలసి ఉంది. అవి ఉంటే ప్రపంచంలో ఏ మూలనైనా విజయం సాధించవచ్చు అని ఒక వైపు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నిరూపిస్తున్నాయి. ఆస్కార్ కోసం మార్కెటింగ్ చేసుకోవాలంటే ఒకటి దేశం నుండి అధికారిక ఎంట్రీ పొందాలి. లేదంటే నేరుగా ఆస్కార్ అవార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలా నేరుగా అప్లై చేసుకున్నవారు మార్కెటింగ్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా చేయగలిగితే కమర్షియల్ సినిమాలు కూడా కొన్ని ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కొట్టవచ్చు. అయితే అందరికీ ఆ అవకాశం ఉండదు. దాదాపు భారతీయ భాషల్లో 1500 సినిమాలు నిర్మాణం అయితే, కేవలం 45 సినిమాలు మాత్రమే ఆస్కార్ సెలెక్షన్ కమిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాయి. వాటిలో 22 సినిమాలు సెలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కి ఎంపికయ్యాయి. అదీ పరిస్థితి. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఆశించదు. అలా ఆశ ఉన్నా, గతంలో ఏ తలుపులు తట్టాలో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచమంతా మన ముంగిట నిలిచింది. అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అవకాశాలను మరిన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. అలా మారుమూల భాషల్లో వస్తున్న ఎంతో మంచి సినిమాలు ఇప్పుడు ఇతర భాషా ప్రాంతాల్లో ఆదరణ పొందుతూ భారతీయ భాషలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నాయి.

2018 సినిమా మలయాళం లో వచ్చిన ఒక అద్భుత దృశ్య కావ్యం. వరద బీభత్స దృశ్యాలను ప్రపంచ సినిమా స్థాయిలో వెండితెరకెక్కించారు దర్శకుడు ఆంథనీ జోసెఫ్. ఈ సినిమా వేల కోట్లు ఖర్చుపెట్టి తీసిన టైటానిక్ కంటే ఏమాత్రం తీసుకోదు. టైటానిక్ తీయడానికి ఒక ప్రాంతంలో వేసిన కల్పిత సముద్ర కల్లోల సెట్ మాత్రమే. కానీ 2018 సినిమా, కేరళ వరదల భయోత్పాత దృశ్యాలన్నీ రెండు గంటల్లో మానవీయ మహోన్నత కోణంతో మనకు చూపించారు. మనిషి, మానవ సమాజం, ప్రకృతి, ప్రభుత్వం అన్నీ కలగలిసిన ఒక ఉద్వేగభరిత మహోదాత్త సినిమా ఇది. ప్రకృతి విపత్తుల సమయంలో అందరూ అందరి కోసం నిలబడతారని, అలా నిలబడే ప్రతి ఒక్కరూ హీరోలే అని ఈ సినిమా సందేశమిస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశిద్దాం. అలాగే మన దక్షిణాది సినిమాలు ఇక ప్రపంచం ముందు రానున్న కాలంలో విజయదుందుభులు మోగిస్తాయని కూడా కాంక్షిద్దాం.