ANR’s Balaraju@75: ‘బాలరాజు’ కి 75 ఏళ్ళు.. తెలుగులో తొలి రజతోత్సవ చిత్రమిదే!

1948 ఫిబ్రవరి 26న 10 ప్రింట్లతో విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించింది.

  • Written By:
  • Publish Date - February 26, 2023 / 07:04 PM IST

‘ముగ్గురు మరాటీలు’ ప్రేక్షకాదరణ పొందింది. ఆ చిత్ర దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య మనసు ఉప్పొంగిపోయింది. తను తీసిన జానపదానికి జనం తొడిగిన కిరీటం చూసుకుని ఆయన తెగ మురిసిపోయారు. మళ్లీ తీస్తే జానపదమే తీయాలనుకున్నారు. అనుకోవడమే కాదు… సముద్రాల రాఘవాచార్యను పిలిచి మంచి జానపద కథ ఉంటే చూడమన్నారు. ఆయన చకచకా ‘బాలరాజు’ (Balaraju) కథ సిద్ధం చేశారు.

కథ వినగానే బలరామయ్య కళ్ల ముందు నిలిచింది… అక్కినేని నాగేశ్వరరావు! ‘శ్రీ సీతారామ జననం’తో తను పరిచయం చేసిన కుర్రాడు… అప్పుడే మెట్టుమెట్టుగా ఎదుగుతున్నాడు. ‘ముగ్గురు మరాటీలు’లో కూడా అతనే హీరో. ‘బాలరాజు’  (Balaraju) పాత్రకు అక్కినేని ఓ.కే. మరి కథానాయికగా ఎవరిని పెట్టుకోవాలి? గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘బాలయోగిని’లో ఏడేళ్ల వయసులోనే నటించి, తరువాత ‘సేవాసదన్‌’ (తమిళం) ‘ప్రేమసాగర్‌’ (హిందీ)… ఇలా ఓ ఇరవై చిత్రాల్లో బాలతారగా చేసిన ఎస్‌.వరలక్ష్మి ‘మాయాలోకం’, ‘పల్నాటి యుద్ధం’ తదితర సినిమాల్లో కథానాయికగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘బాలరాజు’లో అక్కినేనికి ఆమే సరిజోడు అని భావించారు. అలాగే మిగతా తారాగణం ఎంపిక కూడా పూర్తయింది.

గాలి పెంచల నరసింహారావును సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే ఎక్కువ బాధ్యతను జి.వెంకటేశ్వరరావు అనే యువకుడు నిర్వర్తించాడు. అప్పుడతని వయసు 26 ఏళ్లు. అతనే ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇందులో మొత్తం 20 పాటలున్నాయి. ‘నవోదయం… నవోదయం’ పాటను తొలిగా రికార్డు చేశారు. ఇన్ని పాటలా… అంటూ ఆ 20 పాటల్లో కొన్నింటిని తీసేయమని బలరామయ్యకు చాలామంది సూచించినా ఆయన వినలేదు.

ఆరోజుల్లో తారలంతా తమ పాటలు తామే పాడుకునేవారు. అలా అక్కినేని (ANR), ఎస్‌.వరలక్ష్మి, కస్తూరి శివరావు, సీతారాం… తమ పాటలు తామే పాడుకున్నారు. అంజలీదేవికి మాత్రం వక్కలంక సరళ పాడారు. పాటల రికార్డులన్నీ బొంబాయిలోనే తయారీ కాబట్టి షూటింగ్‌ కన్నా ముందే పాటల రికార్డింగ్‌ పూర్తయ్యింది.
‘బాలరాజు’ సినిమా ముందువరకూ తన పాటలూ, పద్యాలూ అక్కినేని స్వయంగా పాడుకునేవారు. ఇందులో ‘చెలియా కనరావా’ పాటను తొలుత అక్కినేని (AKKineni) పాడేశారు. ఆ తర్వాత ఆ పాటని అక్కినేని కోరికమేరకు ఘంటసాలతో పాడించారు బలరామయ్య. యంగ్‌ ఇండియా వారి రికార్డుపై ‘చెలియా కనరావా…’ పాటను అక్కినేని పాడినట్టుగానే ఉంటుంది. అక్కినేనికి ఘంటసాల పాడిన తొలిపాట ఇదేకావడం గమనార్హం. అసలేం జరిగిందో అక్కినేని మాటల్లోనే తెలుసు కొందాం. ”ఈ పాట రెండు మూడు రోజులు అవస్థపడి పాడాను. భావ యుక్తంగా, శృతిపక్వంగా పాడడం నాకు నాటకాల్లో తెలుసు. అదే నేను సినిమాల్లో చేశాను. అయితే ఆ రోజుల్లో నా గొంతు కాస్త ఆడ గొంతుగా ఉండేది. నా గొంతును మగ గొంతుగా చేసే ప్రయత్నంలో నా గొంతు జీరపోయినప్పుడు, నాలో పాడగల శక్తి కూడా క్షీణించడం మొదలుపెట్టింది. అద్భుతంగా పాడే వారి ముందు మనం దీనికోసం ప్రయత్నించి శ్రమపడడం ఎందుకనిపించింది. అప్పటికే ప్లేబ్యాక్‌ సౌలభ్యం కూడా వచ్చేసింది. అందుకే ‘చెలియా కనరావా..’ పాటను ఘంటసాల గారితో పాడించమని బలరామయ్య గారితో చెప్పేశాను. ‘పర్వాలేదు పాడేశావ్‌ కదా’ అని ఆయన అన్నారు. ‘నేనేమీ అనుకోను సార్‌. ఆడగొంతు నుండి మగగొంతు తెచ్చు కోవడానికి నేను చేసిన ప్రయత్నాలవల్ల నా గొంతు జీరబోతోందని’ ఆయనకు చెప్పాను. సరేనని ఆయన ఒప్పుకున్నారు. నేను ముందు పాడిన పాట బొంబాయిలోని యంగ్‌ ఇండియా రికార్డు కర్మాగారానికి వెళ్లిపోయి రికార్డుగా వచ్చేసింది. ఘంటసాల పాడిన పాట సినిమాలో ఉండిపోయింది. అలా ఘంటసాల నాకు తొలిసారిగా పాడారు” అని ఆ విశేషాలను గుర్తు చేసుకుంటారు అక్కినేని. ఇందులో ‘చాలురా వగలు’ పాట చాలా చిన్న పాట. ఈ పాటను అక్కినేని ఆలపించారు. విశేషం ఏమిటంటే ‘బాలరాజు’ చిత్రం అటు అక్కినేనికి, ఇటు ఘంటసాలకు ఏడో చిత్రం.

సినిమా షూటింగ్‌ మొత్తం మద్రాసులోని న్యూటోన్‌ స్టూడియోలోనే జరిగింది. అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం అడవుల్లోకి వెళ్లారుగానీ, సాంకేతిక సౌకర్యాలు లేక అవి ఫేడవుట్‌ కావడంతో మళ్లీ వాటిని స్టూడియోలో సెట్స్‌ వేసి తీయాల్సి వచ్చింది. 1948 ఫిబ్రవరి 26న 10 ప్రింట్లతో విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అప్పట్లో రికార్డుస్థాయిలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్యకు ఎంతో పేరుని, లాభాల్నీ తెచ్చిపెట్టింది. పల్లెల నుంచి ఈ చిత్రం ప్రదర్శింపబడే కేంద్రాలకు ‘బాలరాజు స్పెషల్‌’ (Balaraju) అంటూ ఎడ్లబళ్లు కట్టుకుని వచ్చేవారట.
ఈ చిత్ర వంద రోజుల అభినందన సభలు 1948 జూన్‌ 4 నుంచి 7 వరకూ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు పట్టణాల్లో జరిగాయి. అక్కినేని, అంజలీదేవి, కస్తూరి శివరావు, బలరామయ్య తదితరులు హాజరయ్యారు. 16 ఆగస్ట్‌ 1948 న ఏలూరు రామకృష్ణ షిఫ్టింగ్‌ థియేటర్లో రజతోత్సవ సభ జరిగింది. సభానంతరం ఎస్‌.వరలక్ష్మి పాటకచేరి జరిగింది.

తెలుగు సినిమా రంగంలో వంద రోజుల వేడుకలు జరిపే సంప్రదాయానికి ‘బాలరాజు’ శ్రీకారం చుట్టింది. అలాగే తెలుగులో తొలి రజతోత్సవ చిత్రంగా ‘బాలరాజు’ చరిత్రలో నిలిచిపోయింది. ఆగస్టు 16న ఏలూరు రామకృష్ణ థియేటర్‌లో రజతోత్సవ సభ జరిగింది. తెలుగు సినిమా పుట్టిన తొలి దశలో వచ్చిన ‘బాలరాజు’ తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారిగా చూపించింది. చిన్న చిన్న కేంద్రాల్లో కూడా వీరవిహారం చేసింది. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి థియేటర్ల నిర్మాణానికి చాలామంది ఉత్సాహం చూపించారు. అప్పట్లో ఇదో కొత్త పరిణామం. జానపద చిత్రాల్లో ‘బాలరాజు’ ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చింది. పేరుకి జానపదమే అయినా, ఇందులో ప్రేమకథే ప్రధాన ఇతివృత్తం. ‘ప్రేమ సర్వాంతర్యామి. ప్రేమికుల్ని ఎవరూ విడదీయలేరు’ అనే అంశాన్ని ఆ కాలంలోనే ఆకట్టుకునే విధంగా తీశారు బలరామయ్య. ఆ తరువాత చాలా ప్రేమకథలకు ఈ సినిమా ఒక ప్రేరణగా నిలిచింది. ప్రేమ ప్రధాన ఇతివృత్తం కావడంతో నాటి యువతను ఈ సినిమా బాగా ఆకట్టుకోగలిగింది. నిస్వార్థ ప్రేమికులు స్వర్గసుఖాలను సైతం లెక్కచేయక, కష్టాలకు ఓడిపోక ఒకరికొకరు జీవిస్తారనీ, జీవించాలనీ ‘బాలరాజు’ సందే శాన్ని ఇచ్చింది. ‘బాలరాజు’గా అక్కినేని అఖిలాంధ్ర ప్రేక్షక హృద యాల్లో చిరస్థానాన్ని సంపాదించు కున్నారు. ‘బాలరాజు నాగేశ్వర రావు’ అనేది ఆయన వ్యవహార నామం అయిపోయింది. అక్కినేని మాస్‌ హీరోగా లక్షలాది ప్రజలకు మొదటిసారిగా అత్యంత సన్నిహితు డైంది ఈ చిత్రంతోనే. ఇందులో హీరో, హీరోయిన్‌ని చూసి పారి పోతుంటాడు. పైగా పలుమార్లు శాపాలకు గురై, నాయిక ప్రతిభ వల్ల బ్రతికి బట్టకడుతూ వుంటాడు. హీరోయిజం చూపే పాత్ర కాకున్నా, ‘బాలరాజు’ పాత్రను వినోదభరి తంగా తీర్చిదిద్దారు బలరామయ్య.

అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి జంటకు ఎంతో క్రేజ్‌ లభించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వదంతులు కూడా అప్పట్లో విశేషంగా వినిపించాయి. ఎస్‌. వరలక్ష్మి గొంతు అంటే అప్పటి ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ ఉండేది. ఆ గొంతులోని హస్కీనెస్‌ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ”నాకు తెలుగులో బాగా పేరు తెచ్చిన చిత్రం ‘బాలరాజు’. ఈ చిత్రంలో నేను పాడిన ప్రతి పాట నాకు సంతృప్తి నిచ్చిందే. ‘ఎవరినే నేనెవరినే’, ‘రాజా రారా నా రాజా రారా’ వంటి సోలోలు, ‘తేలి చూడుము హాయి’ అనే జావళీ ఇవన్నీ అప్పటి రికార్డులను అధిగమించి హిట్టయ్యాయి. నిజానికి ఈ చిత్రంలో పాటలు చాలా ఎక్కువ. దాంతో కొన్ని తీసేయాలనుకున్నారు. కానీ బలరామయ్య గారు ‘అమ్మాయి అంత బాగా పాడితే, ఎందుకండీ తీసేయ్యాలి. ఒక్కపాట కూడా తగ్గించేది లేదు’ అని భీష్మించుకూర్చున్నారు. ఆయన ఆశించినట్లే పాటలే సినిమాను సక్సెస్‌ చేశాయి” అని ఓ సందర్భంలో చెప్పారు ఎస్‌.వరలక్ష్మి.

నిజానికి బాలరాజు నటనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదు. ”అవును. బాలరాజు పాత్ర అంత కష్టతరమైందేమీ కాదు. ఆ వయసుకి తగినట్లే ప్రేమానురాగాలకు అర్థం తెలియని అందాల ముగ్ధబాలకుని పాత్ర అది. ప్రేమంటే అర్థం తెలియదు. కానీ ఆ పాత్రద్వారా ఎందరి హృదయాలకో చేరు వయ్యాను. హీరోగా, బాలరాజుగా నేనట్టే శ్రమపడలేదు. కానీ, బాలరాజుని నాగేశ్వర రావుగా అభిమానులు వెర్రిగా ఆరాధించడం మొదలు పెట్టారు” అని చెబుతారు అక్కినేని. ఈ సినిమా అక్కి నేనిని స్టార్‌ని చేయడమే గాకుండా, ఓ ఇంటి వాడిని కూడా చేసింది. ఏదో పని విూద గుడి వాడ వచ్చిన అక్కినేని, అన్నపూర్ణను పెళ్లి చూపులు చూశారు. ‘బాలరాజు’ శతదినోత్స వానికి వచ్చినప్పుడు తమ నిర్ణయం చెబుతా మని అన్నపూర్ణ నాన్న గారు కొల్లిపర నారా యణరావు చెప్పారు. సినిమా హీరోకెందు కులే అని తొలుత ఆయన జంకినా, అన్నపూర్ణ మాత్రం పట్టు పట్టడంతో పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ‘బాలరాజు’ సినిమా విడుదలైన ఏడాదికి అక్కినేని, అన్నపూర్ణ ఒక్కటయ్యారు.

‘బాలరాజు’ అనూహ్య విజయం సాధించడంతో ఇందులో పనిచేసిన వారందరికీ పేరు వచ్చింది. నటీనటులకి పారితోషికాలు పెరిగాయి. ప్రత్యేకించి కస్తూరి శివరావుకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. అప్పటివరకూ చిన్న వేషాలు వేస్తూ వచ్చిన శివరావు ‘బాలరాజు’తో స్టార్‌ అయిపోయారు. పాపులర్‌ హాస్య జంట నల్లరామ్మూర్తి, సీతారామ్‌ల్లో ఒకరైన సీతారామ్‌ ఇందులో కాపలాదారు రాములు వేషం వేసి, ‘సూడసక్కని సిన్నది ఆ మేడ గదిలో ఉన్నది’ అనే పాట పాడారు. ప్రసిద్ద నటీమణి అంజలీదేవి ఇందులో కనిపిస్తారు. ”నిజానికి ఇందులో నాది చిన్న పాత్ర. మొదటి అరగంటలోనే వస్తుంది. ‘తీయని వెన్నెల రేయి’ అనే పాటకు నేను చేసిన డాన్సులు నాకెంతో పేరు తెచ్చాయి. వక్కలంక సరళ ఆ పాట పాడింది. ఆ అభిమానంతోనే సరళ కూతురు స్వప్న (ప్రముఖ నర్తకీమణి స్వప్నసుందరి)కు ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమాలో అవకాశం ఇచ్చాను” అని చెబుతారు అంజలీదేవి.

తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు ఇందులో ‘ఎవని తరంబౌ నెవనికి వశమౌ…’ అనే పాటను రాశారని, ఆ పాటను కస్తూరి శివరావు తదితరులపై చిత్రీ కరించారని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం లభిస్తున్న వీడియో డిస్కుల్లో ఎక్కడా ఈ పాట క(వి)నబడదు. ఈ సినిమా ఘంటసాలకు బలమైన పునాది వేసింది. సినిమాల్లో వేషాలు వేసుకు బతుకుదామనీ, పాటలు పాడదామనీ 1944లో మద్రాసు వచ్చిన ఘంటసాలకు అసలు సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్లుంటారన్న సంగతే తెలీదు. అన్ని సినిమా కంపెనీలకు అలసట లేకుండా అవకాశాలకోసం తిరుగుతున్న ఘంటసాలతో నెలకు 75 రూపాయల జీతానికి ‘శ్రీ సీతారామ జననం’లో ఎక్‌స్ట్రా వేషం వేయించారు బలరామయ్య. ఆ తర్వాత ‘స్వర్గసీమ’తో ప్లేబాక్‌ సింగర్‌ అయ్యారాయన. 1945లో భరణీవారి ‘రత్నమాల’ సినిమాకి సుబ్బురామన్‌ దగ్గర అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరారు. ఇందులో సోలోగా ‘చెలియా కనరావా ఇక…’ పాట పాడిన ఘంటసాల, ‘నవోదయం శుభోదయం…’ పాటను వక్కలంక సరళ, బృందంతోనూ, ‘తేలి చూడుము హాయి…’ పాటను ఎస్‌. వరలక్ష్మితోనూ కలిసి ఆలపించారు. ‘రత్నమాల’ తరువాత ‘బాలరాజు’కి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి 11 పాటలు వరకు కంపోజ్‌ చేశారు. వెంటనే ‘లక్ష్మమ్మ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇందులో నాలుగు పాటలను ఘంటసాల చేసినా, ఆ క్రెడిట్‌ కూడా గాలి పెంచలనరసింహారావుకే దక్కింది. గాలి పెంచలనరసింహారావుకు సి.ఆర్‌.సుబ్బురామన్‌ (‘దేవదాసు’ ఫేమ్‌) ఆ రోజుల్లో అసిస్టెంట్‌గా ఉండేవారు. ఆయన ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని, ఆర్కెస్ట్రయిజేషన్‌ని సమకూర్చారు. ఇందులో మూడు పాటల్ని సుబ్బురామన్‌, మూడు పాటల్ని ఘంటసాల, మిగిలిన వాటిని నరసింహారావు స్వరపరిచారని కొందరు చెబుతారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ ఛీఫ్‌గా పనిచేసిన వెన్నెలకంటి కోటేశ్వరరావు తనయుడే సినీ రచయిత వెన్నెలకంటి. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.ఎన్‌.స్వామి అంతకుముందు ‘ధ్రువ మార్కండేయ’లో బాలనటుడిగా చేశారు. ఆతర్వాత ప్రతిభావారి ‘చిన్న కోడలు’, స్వాతి వారి ‘రూపవతి’ చిత్రాల్లో హీరోగా నటించారు.

సావిత్రి, జమున మనసు దోచిన ‘బాలరాజు’
ఈ సినిమా విడుదల నాటికి మహానటి సావిత్రికి పధ్నాలుగేళ్లు. అక్కినేని అంటే చెప్పలేని అభిమానం. ‘బాలరాజు’ సినిమాని అనేకసార్లు చూసింది. ఈ చిత్రం శతదినోత్సవ అభినందన సభ బెజవాడలోని జైహింద్‌ టాకీస్‌లో జరుగుతుంటే అక్కినేనిని చూడడంకోసం వెళ్లిందామె. అక్కినేని రాగానే జనం ఒక్కసారిగా ఎగబడటంతో సావిత్రి పక్కనే ఉన్న కాలవలో పడి ఓణి, పరికిణీ పాడయిపోయాయి. 1962లో బెజవాడ మారుతీ టాకీసులో జరిగిన ‘మంచి మనసులు’ శతదినోత్సవ సభలో సావిత్రి స్వయంగా ఈ విషయం చెప్పారు.
అలాగే సావిత్రి తొలి రోజుల్లో అంజలీదేవిని ఆదర్శంగా తీసుకునేవారు. స్టేజ్‌ విూద తను చేసే నృత్య ప్రదర్శనలలో అంజలీ దేవి సినిమా నృత్యాలను అనుకరించేవారు. ముఖ్యంగా ‘బాల రాజు’లో తీయని వెన్నెలరేయి.. పాటకు అంజలీదేవి చేసిన నృత్యాన్ని సావిత్రి తన ప్రదర్శనల్లో ఆకర్షవంతంగా చేసేవారు.
తెలుగు సినీ చిత్రరంగంలో ఎన్నో క్లాసిక్‌ సాంగ్స్‌కి నృత్య దర్శకత్వం నెరపిన ఘనాపాఠి పసుమర్తి కృష్ణమూర్తి రంగస్థలం నుంచి సినిమా రంగానికి రావడానికి ప్రేరేపించిన పాట ‘తీయని వెన్నెలరేయి’. ఈ పాట ఇలా ఎందరినో మెస్మరైజ్‌ చేసింది. సినిమాల్లోకి రాకముందు నుంచే జమున, సినిమాలు బాగా చూసేవారు. ముఖ్యంగా ‘బాలరాజు’ సినిమాని ఎస్‌. వరలక్ష్మి పాడిన రాగమాలిక కోసం పదిసార్లు చూశానని ఆమె స్వయంగా చెప్పారు.

Also Read: Pawan Kalyan Movie: పవన్ మూవీలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్