Agency : ఏజెన్సీలో ఐటీడీఏ స‌ర్వే..978 డోలీ నివాసాలు గుర్తింపు…!

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లాలంటే న‌ర‌కం చూడాల్సిందే. ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు ఆసుప‌త్రుల‌కు వెళ్లాలంటే వారిని కిలోమీట‌ర్ల మేర డోలీ మోసుకుపోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు స‌రిక‌లేక‌పోవ‌డం వారికి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది.

  • Written By:
  • Updated On - December 13, 2021 / 11:19 PM IST

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లాలంటే న‌ర‌కం చూడాల్సిందే. ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు ఆసుప‌త్రుల‌కు వెళ్లాలంటే వారిని కిలోమీట‌ర్ల మేర డోలీ మోసుకుపోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు స‌రిక‌లేక‌పోవ‌డం వారికి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. విశాఖపట్నంలోని 11 గిరిజన మండలాల్లో ఐటీడీఏ ఇటీవల నిర్వహించిన సర్వేలో 978 నివాస‌ల‌ను ‘డోలీ నివాసాలు’గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు చెక్క స్తంభానికి కట్టిన గుడ్డతో తయారు చేసిన ‘డోలీ’ తో రోగుల‌ను తీసుకెళ్లాల్సి వ‌స్తుంది. ఏజెన్సీ గ్రామంలో ఎక్క‌డా కిలోమీట‌ర్ల దూరంలో ఆసుప‌త్రులు లేకపోవ‌డం సరైన రహదారి కనెక్టివిటీ లేకపోవడంతో, అంబులెన్స్‌లు తరచుగా గిరిజన ప్రాంతంలోని అంతర్గత ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి.

11 గిరిజన మండలాల్లో 70% గిరిజన ఆవాసాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 84% ఆవాసాలలో ఇంటర్నెట్ అనేది ఎంట్రీనే లేదు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి మాట్లాడుతూ సమాచారం కోసం ఈ సర్వే నిర్వహించడం తప్పనిసరి అన్నారు. గత జనాభా గణన నుండి చాలా కాలం గడిచినందున త‌మ‌ వద్ద తాజా డేటా లేదని ఆయ‌న తెలిపారు. త‌మ‌ కార్యకలాపాలు, సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి త‌మ‌కు ఈ డేటా అవసరమ‌వుతుంద‌ని ఐటీడీఏ సిబ్బందితో ఈ సర్వే నిర్వహించడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింద‌ని తెలిపారు.

11 మండలాల్లో మొత్తం జనాభా 6.59 లక్షలు ఉన్నారు. గిరిజన జనాభాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. 11 జిల్లాల్లో 3.23 లక్షల మంది పురుషులు ఉండగా…. మహిళ‌లు 3.35 లక్షలుగా ఉన్నారు . కొండ ప్రాంతాల్లో ఎప్పుడూ పురుషుల కంటే స్త్రీల సంఖ్యే ఎక్కువగా ఉంటుంద‌ని గోపాల‌కృష్ణ తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల్లో అబ్బాయి అమ్మాయి అనే తేడాను కలిగి ఉండవు కాబట్టి ఇక్క‌డ ఆడ శిశుహత్యలు లేవ‌న్నారు.

దేశంలోని 44 గిరిజన జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి, మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రూ.33,822 కోట్లను నెల రోజుల కిందటే కేంద్ర మంత్రివర్గం మంజూరు చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు గిరిజన జిల్లాల్లో దాదాపు 1.4 లక్షల కిలోమీటర్ల రోడ్లు, 2,500 కంటే ఎక్కువ వంతెనలను నిర్మించడంలో సహాయపడతాయి. 4G-ఎనేబుల్డ్ మొబైల్ ఫోన్ టవర్లను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలో టెలికాం కనెక్టివిటీ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2022 వరకు గడువు విధించింది