ఒకప్పుడు ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించి వెళ్లాడు. ఆనాడు జరిగిన అవమానాన్ని భరించలేక కుంగి కుసించిపోయాడు ఎన్టీఆర్. ఆనాడు ఎన్టీఆర్ కు జరిగిన పరాభవానికి కారణం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, స్పీకర్ గా ఉన్న యనమల రామక్రిష్ణుడు.
ఉమ్మడి ఏపీ అసెంబ్లీ 1995లో లక్ష్మీపార్వతిని బూచిగా చూపి చంద్రబాబు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేశాడు. బలపరీక్ష సమయంలో సభ్యులు అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాడు యనమల రామక్రిష్ణుడు. ఎమ్మెల్యే హోదాలో ఎన్టీఆర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా బాబు ఆదేశం మేరకు యనమల అవకాశం ఇవ్వలేదట.
పదవీచ్యుతుడైన ఎన్టీఆర్ మానసిక క్షోభను చెప్పుకునేందుకు అసెంబ్లీ వేదికగా ప్రయత్నించినా సభానాయకుడిగా ఉన్న బాబు, స్పీకర్ యనమల కరుణించలేదు. దాంతో మరింత క్షోభకు గురైన NTR అసెంబ్లీకి మళ్లీ సీఎంగా వస్తానని శపథం చేసి బయటకు వెళ్లాడు. సభలో ఉండలేనంటూ ఎన్టీఆర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అత్యధిక మెజార్టీతో 1994లో పార్టీని గెలిపించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లెజెండ్ కు ఆనాడు జరిగిన పరాభవం, అవమానం వర్ణించలేనిది.
తన చరిష్మాతో గెలిచిన ఎమ్మెల్యేలు బాబు పక్షాన చేరడాన్ని మానసికంగా ఎన్టీఆర్ భరించలేకపోయాడు. స్పీకర్ స్థానంలో ఉండే యనమల రామకృష్ణుడు వ్యవహరించిన తీరు ఆయన్ను మరింత బాధ పెట్టింది. మారుమూల ఎలాంటి గుర్తింపులేని వాడిని ఎమ్మెల్యేగా చేస్తే..ఇలా వ్యవహరిస్తాడా..అని స్పీకర్ యనమల తీరుపై ఎన్టీఆర్ కలత చెందాడు. చంద్రబాబు, యనమల ఆడిన గేమ్ కారణంగా ఎన్టీఆర్కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
ఒక్క మాట కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోవడంతో కన్నీళ్లు పెడుతూ భారమైన మనసుతో అసెంబ్లీ ని ఎన్టీఆర్ బహిష్కరించాడు. మళ్లీ సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ శపథం చేసి ఎన్టీఆర్ బయటకు వెళ్లిన ఆ సీన్ ఇప్పుడు కనిపించింది. ఆనాడు ఎన్టీఆర్ ఎలాగైతే అసెంబ్లీలో అవమాన పడ్డాడో..ఇప్పుడు చంద్రబాబు కూడా ఇంచుమించు అదే తరహా బాధతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు.
సుమారు 25 ఏళ్ల తరువాత విభజిత ఏపీ అసెంబ్లీ వేదికగా అలాంటి సంఘటనే జరిగింది. ఇదే..విధి చాలా బలమైనది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం.