ఇటీవలి కాలంలో 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (buy now pay later-BNPL) అని చెబుతూ చాలా మొబైల్ యాప్స్ భారతీయ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ యాప్స్ క్రెడిట్ కార్డ్స్ మాదిరిగా పని చేస్తాయి. ఈ BNPL వినియోగదారులకు విద్యుత్ బిల్లులు, ఆహారం, షాపింగ్ వంటి ఉత్పత్తులు, సేవల కోసం ముందస్తుగా చెల్లించేందుకు తక్షణ క్రెడిట్‌ను అందిస్తాయి.
లేజీపే యాప్ ద్వారా రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. మీ క్రెడిట్ లిమిట్ ఎంతనో తెలుసుకోవడానికి మీకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ఇందులోని ప్రయోజనాల్లో మీరు రూ.1 లక్ష మొత్తమే కాదు, రూ.10,000 లేదా రూ.20,000 వంటి తక్కువ మొత్తాల కోసం కూడా పర్సనల్ లోన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ క్రెడిట్ లిమిట్ వరకు ఎంత అయితే అంత లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పేయూ ఫైనాన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ లేజీపే టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో ముందుకు వచ్చింది.
'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'తో ముందుకు వచ్చిన మరో షాపింగ్, పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌పే. ఈ యాప్ ద్వారా ఏ ఉత్పత్తిని అయినా ముందుగా కొనుగోలు చేసి, తర్వాత చెల్లించవచ్చు. ఈ యాప్ మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. అంతేకాదు, మీ నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయడంలో మీకు సహకరిస్తుంది.
పోస్ట్‌పే యాప్‌ను ఇండియన్ ఫిన్‌టెక్ సంస్థ భారత్ పే లాంచ్ చేసింది. యూపీఐ పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడంలో మార్కెట్ లీడర్‌గా ఉంది భారత్ పే.
ఫిన్‌టెక్ సంస్థల్లో భారత్‌లో పేటీఎం మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రారంభంలో ఇది మొబైల్ యాప్ డెయిలీ పేమెంట్ యాప్, డిజిటల్ వ్యాలెట్‌గా వచ్చింది. 2015లో పేమెంట్ బ్యాంకులోకి అడుగు పెట్టింది.
పేటీఎం పోస్ట్‌పెయిడ్ సదుపాయం నిర్దిష్ట వ్యాపారి వెబ్ సైట్ లేదా పేటీఎం ప్లాట్‌ఫాం చెల్లింపులను ఆమోదించే దుకాణాల నుండి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్లో చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు 30 రోజుల పాటు సున్నా శాతం వడ్డీతో రూ.60,000 వరకు క్రెడిట్ పొందవచ్చును. పేటీఎం పోస్ట్ పెయిడ్ సదుపాయాన్ని పొందడం అనేది పూర్తి డిజిటల్ ప్రక్రియ.
అమెజాన్ పే ఈఎంఐ సేవలను అమెజాన్ పేలాటర్గా పేరు మార్చారు. అమెజాన్ డాట్ ఇన్ ఈఎంఐ కొనుగోలుకు ఇది వేగవంతమైన ప్రక్రియ.
వన్ టైమ్ సెటప్ ప్రాసెస్ ద్వారా రెండు నిమిషాల్లో దీనిని పూర్తి చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ పే లాటర్ ద్వారా తమ కస్టమర్లకు ముందుగా కొనుగోలు చేసి, తర్వాత చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని అందిస్తోంది. ఇందులో క్రెడిట్ లిమిట్ రూ.70,000 వరకు ఉంది. కస్టమర్లు తమ ప్లాట్ ఫామ్ పైన క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్‌లో చెకౌట్ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా నిరోధించేందుకు కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ పే లాటర్ను ఉపయోగించవచ్చు. ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు ఆ మొత్తాన్ని వచ్చే నెల 5వ తేదీ లోపు చెల్లించాలి. ఇందుకు గాను ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. ఫ్లిప్‌కార్ట్ పేతో మీ బిల్స్‌ను ట్రాక్ చేయడం చాలా సులభం.
BNPL యాప్స్ బ్యాంకుల వలె ఎక్కువగా లేట్-ఫీ, వడ్డీ రేట్లను విధించడం లేదు. క్రెడిట్ కార్డ్ రావాలంటే వేతనం, వ్యాపారం, సిబిల్ స్కోర్, చెల్లింపు సామర్థ్యం.. ఇలా ఎన్నింటినో పరిగణలోకి తీసుకుంటారు. అయితే buy now pay later అయితే ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని, రుణాలు ఇస్తుంటాయి. ఈజీ రుణ దరఖాస్తు, అంతగా రిస్క్ లేని ప్రక్రియ, తక్కువ ఛార్జీ వంటివి ఉన్నాయి. దీంతో ఇవి ఆదరణ పొందుతున్నాయి.