డిసెంబర్ 1వ తేదీ నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ షాపింగ్ ఈఎంఐ కాస్త భారమైంది. ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డు పైన వడ్డీ రేటు మాత్రమే ఉంది. ఈ నెల నుండి ప్రాసెసింగ్ ఫీజును కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇక నుండి క్రెడిట్ కార్డు కస్టమర్లపై కాస్త భారం పడుతుంది.

ప్రాసెసింగ్ ఫీజును రూ.99 వసూలు చేయనుంది. దీంతో పాటు ఇతర పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీని చెల్లించాలి. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ వద్ద ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి

దేశంలో క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ రెండోఅతిపెద్ద బ్యాంకు. 12.76 మిలియన్ల మంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌ను వినియోగిస్తున్నారు. దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో ఎస్బీఐ వాటా 19 శాతం. అంటే ఈ కోట్లాది మంది వినియోగదారులపై భారం పడుతుంది.

ఎస్బీఐ కంటే ముందు ఇతర బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డు ఈఎంఐ పైన ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు ఈజీ ఈఎంఐ పైన రూ.199 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తోంది. క్రెడిట్ కార్డు వినియోగంలో ఈ బ్యాంకు వాటా 23 శాతంగా ఉంది.

మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు షాకిచ్చింది. తాజాగా వడ్డీరేట్లను సవరించింది. సేవింగ్స్ అకౌంట్స్ పైన వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో వడ్డీరేటు ఇప్పుడు 2.8 శాతం నుండి ప్రారంభమవుతుంది.