ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇమ్మీడియేట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ట్రాన్సాక్షన్స్ పరిమితిని పెంచింది.

ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఎస్బీఐ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా రూ.5 లక్షల వరకు నగదును బదలీ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ నిర్వహించినప్పుడు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని,  శాఖల వద్ద నిర్వహించే రూ.2 లక్షల వరకు ట్రాన్సాక్షన్స్‌కు పాత ధరలు వర్తిస్తాయని వెల్లడించింది.

రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల ఐఎంపీఎస్ శ్లాబ్‌ను బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించినప్పుడు మాత్రమే రూ.20 సర్వీస్ ఛార్జీ వర్తిస్తుందని వెల్లడించింది. దీనికి జీఎస్టీ అదనం.

రూ.1000 వరకు ఎలాంటి చార్జీలు వర్తించవు. రూ.1000 నుండి రూ.10 వేల వరకు రూ.2 ప్లస్ జీఎస్టీ. రూ.10 వేల నుండి రూ.1 లక్ష వరకు రూ.4 ప్లస్ జీఎస్టీ. రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రూ.12 ప్లస్ జీఎస్టీ. రూ.2 లక్ష నుండి రూ.5 లక్షల వరకు రూ.20 ప్లస్ జీఎస్టీ.

ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్ అంటే తక్షణ నగదు బదలీ చెల్లింపు వ్యవస్థ ఈ IMPS. ఈ విధానం ద్వారా వ్యక్తులు దేశీయంగా క్షణాల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్సెమ్మెస్ వంటి వివిధ చానల్స్ ద్వారా బ్యాంకులు, ఆర్బీఐ ఆథరైజ్డ్ పీపీఐలలో ఇంటర్ బ్యాంకు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్ సేవలను సెలవు రోజుల్లోను నిత్యం యాక్సెస్ చేయవచ్చు.