దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌లోని సరికొత్త వేరియంట్ ఒమైక్రాన్ క్రమంగా అన్ని దేశాలకు పాకుతోంది. తాజాగా జపాన్‌లో నేడు (మంగళవారం) తొలి కేసు నమోదైంది.

బాధితుడు ఇటీవల నమీబియా నుంచి వచ్చాడని, వయసు 30-40 మధ్యలో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

బాధితుడి నుంచి సేకరించిన నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విశ్లేషించగా అతడికి సోకింది ఓమైక్రాన్ అని తేలింది. విమానంలో అతడితోపాటు ప్రయాణించిన ప్రయాణికులను గుర్తించి జపాన్ ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

బాధితుడి ఇద్దరి బంధువులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయిందని, ప్రస్తుతం వారు నరిటా విమానాశ్రమం సమీపంలోని ప్రభుత్వ ఫెసిలిటీలో క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని, అలాగే, జినోమ్ విశ్లేషణ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్టు మత్సునో తెలిపారు. కాగా, ఒమైక్రాన్ నేపథ్యంలో నేటి నుంచి దేశంలోకి విదేశీయులను ఎవరినీ అనుమతించబోమని జపాన్ నిన్ననే ప్రకటించింది.

జపాన్ దేశీయులు, రెసిడెంట్ పర్మిట్ ఉన్న విదేశీయులు కనుక దేశంలోకి వస్తే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.