Marriage Days are Back: పెళ్లి కళ వచ్చేసింది.. మే, జూన్‌లో ముహూర్తాల క్యూ

వివాహం (Marriage), గృహ ప్రవేశం వంటి శుభకార్యాలను ఎప్పుడు పడితే అప్పుడు నిర్వహించరు. సరైన ముహూర్తంలో వాటిని నిర్వహిస్తేనే శుభ ఫలితాలు వస్తాయి.

Marriage Days are Back : వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలను ఎప్పుడు పడితే అప్పుడు నిర్వహించరు. సరైన ముహూర్తంలో వాటిని నిర్వహిస్తేనే శుభ ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు, అవస్థలు ఎదురుకావు. జీవితం కూడా ఆనందమయం అవుతుంది. ఖర మాసం సమయంలో వివాహం, గృహ ప్రవేశం, క్షవరం మొదలైన శుభ కార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఖర మాసం ముగిసిన తర్వాత శుభ కార్యాలు ప్రారంభమవుతాయని నమ్ముతారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఖర మాసం ముగిసింది. గురు, శుక్రుడు ఉదయించిన తర్వాతే వివాహ యోగం ఏర్పడుతుంది. ఈ లెక్కన ఈరోజు (మే 1) నుంచే శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. అటువంటి పరిస్థితిలో రాబోయే నెలల్లో వివాహం (Marriage), ఇతర శుభ కార్యాలకు చాలా తేదీలు ఖరారు అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహానికి (Marriage) అనుకూలమైన తేదీలు ఇవే..

మే నెల – 1, 3, 7, 11, 12, 17, 21, 22, 26, 29,
జూన్ నెల – 5, 7, 8, 9, 12, 14, 18, 22, 23, 25, 28
నవంబర్ నెల – 23, 24, 27, 28, 29
డిసెంబర్ నెల – 5, 6, 7, 8, 9, 11, 15

కల్యాణ మండపాలు హౌస్ ఫుల్ ..

ఈనేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలు నిశ్చయమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సగం రోజులు వివాహాలకు కల్యాణ మండపాలు బుక్‌ అయ్యాయి. ఎక్కువ మందికి సరిపోయే నక్షత్రాలు జూన్‌ 7, 8, 9 తేదిల్లో ఉండటంతో ఆ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరగబోతున్నట్లు సమాచారం. జూన్‌ 14 తరువాత పెళ్లి ముహూర్తాల కోసం ఆగస్టు 18వ తేది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. పెళ్లిళ్ల సీజన్ వల్ల మండపాలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, క్యాటరింగ్‌, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌ హౌస్ లకు మంచి డిమాండ్‌ రాబోతోంది.

దేవశయని ఏకాదశి.. దేవోత్తన్ ఏకాదశి తెలుసా?

హిందూ మత విశ్వాసం ప్రకారం.. దేవశయని ఏకాదశి తేదీ నుంచి వివాహాలు, శుభకార్యాలు ఆగిపోతాయి. పంచాంగం ప్రకారం, దేవశయని ఏకాదశి తేదీ ఈ సంవత్సరం జూన్ 29 న వస్తుంది. ఆ రోజు నుంచి విష్ణు మూర్తి నిద్ర కోసం క్షీరసాగరానికి వెళ్తారని నమ్ముతారు. ఆ తర్వాత ఏ శుభ కార్యమూ జరగదు. దేవోత్తన్ ఏకాదశి రోజున విష్ణు మూర్తి నిద్ర నుంచి మేల్కొంటారని నమ్ముతారు. ఈసారి ఈ తేదీ 2023 నవంబర్ 23న వస్తుంది. మళ్ళీ ఈ తేదీ నుంచి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.

Also Read:  Workouts @ Home: ఇంటి దగ్గరే చేసుకోగలిగే 15 ఈజీ బైసెప్ వర్కౌట్స్ ఇవిగో..