Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

నాలుగైదు రోజుల క్రితం గుజరాత్ లోని భలేజ్, ఖంభోలజ్, రాంపురా, సైలా, ఉమ్రేత్, నదియాడ్‌ గ్రామాల్లో లోహపు బంతుల వర్షం కురిసింది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 06:30 PM IST

నాలుగైదు రోజుల క్రితం గుజరాత్ లోని భలేజ్, ఖంభోలజ్, రాంపురా, సైలా, ఉమ్రేత్, నదియాడ్‌ గ్రామాల్లో లోహపు బంతుల వర్షం కురిసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. దీనిపై ఆనంద్ , సురేంద్రనగర్, ఖేడా జిల్లాల కలెక్టర్ల కు కూడా సమాధానం ఇచ్చారు. గుజరాత్ రాష్ట్ర సర్కారు నుంచి సమాచారం అందడంతో ఇస్రో కూడా స్పందించింది. వెంటనే ఆ గ్రామాలకు నిపుణులను పంపి , లోహపు బంతుల శాంపిళ్ళను సేకరించింది. లోహపు బంతులు నలుపు, వెండి రంగుల్లో ఉన్నట్లు గుర్తించారు. భలేజ్‌‌ గ్రామంలో గత గురువారం సాయంత్రం 4.45 గంటలకు పడిన నల్ల రంగులోని మెటల్ బాల్ బరువు ఐదు కేజీలు ఉందని వెల్లడైంది.

భలేజ్‌‌ లో లోహపు బాల్ పడిన కొద్దిసేపటికే మరో రెండు ప్రదేశాల నుంచి కూడా ఇలాంటి నివేదికలు వచ్చాయి. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లోనూ ఇలాంటి లోహపు బాల్స్ పడ్డాయి. 15 కిలోమీటర్ల పరిధిలో పక్కపక్కనే ఉండే ఈ మూడు గ్రామాల్లో లోహపు బాల్స్ పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అవి శాటిలైట్ వ్యర్థాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాకెట్ ప్రయో సమయంలో ఉపయోగించే అధిక సాంద్రత కలిగిన లోహాలతో ఈ బంతులను తయారు చేసినట్టు తెలుస్తోంది. వీటిని పరిశీలించేందుకు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ కూడా రంగంలోకి దిగింది. ఇలాంటిదే ఒక ఘటన ఈ ఏడాది ఏప్రిల్లో జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి వింత వస్తువులు పడ్డాయి. అందులో ఆరు లోహపు బంతులు, ఒక మెటల్ రింగ్ ఉన్నాయి. ఈ లోహపు బంతులు చైనా లాంగ్ మార్చ్ 3 బి రాకెట్ నుంచి పడి ఉండొచ్చని అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఇస్రో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. లోహపు బంతి పడి తన గేదె చనిపోయిందని చెప్పిన ఒక వ్యక్తిని పోలీసులు దర్యాప్తు చేయగా.. తీవ్ర అప్పులలో ఉన్న తాను, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం లభిస్తుందనే ఆశతో ఇలా చెప్పానని ఒప్పుకున్నాడు.