Pandikona Dogs : బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఏపీఎఫ్ వంటి భారత సాయుధ బలగాలకు తనిఖీపరమైన కార్యకలాపాల్లో చేదోడుగా ఉండేందుకు భవిష్యత్తులో స్వదేశీ శునకాలను ఉపయోగించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పందికోన శునకాలకు అలాంటి ఛాన్స్ దక్కొచ్చనే చర్చ నడుస్తోంది. పందికోన కుక్కలను తనిఖీల కోసం ఉపయోగించే అంశాన్ని కేంద్ర సాయుధ బలగాలు పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ బాధ్యతలను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)లోకి కర్ణాటకలోని ముధోల్ ప్రాంతానికి చెందిన వేట కుక్కలను ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించారు. ఈనేపథ్యంలో స్వదేశీ శునకాలలో మంచి లక్షణాలు కలిగిన వాటిపై ఆసక్తికర చర్చ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join.
పందికోన కుక్కల ఆసక్తికర వివరాలివీ..
- కర్నూలులోని పందికోన ఓ మారుమూల గ్రామం. నిజం చెప్పాలంటే అది ఓ అడవి…అక్కడ పెరిగే ప్రత్యేకమైన కుక్కలే పందికోన కుక్కలుగా పేరుగాంచాయి.
- కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో పందికోన ఉంది. పత్తికొండకు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో పందికోన ఉంటుంది.
- పందికోన జనాభా 5000పైనే ఉంటుంది.
- పందికోన గ్రామానికి చుట్టూ పెద్ద అడవి ఉంటుంది. గతంలో గ్రామంపైకి పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు దాడి చేసేవి. ఈక్రమంలో స్థానికులకు కుక్కలు సాయపడేవి.
- ఇటువంటి పరిస్థితుల నడుమ పందికోన కుక్కలకు వీరోచితంగా పోరాడే లక్షణాలు, ముప్పును దూరం నుంచే పసిగట్టే స్వభావం సహజసిద్ధంగా లభించాయి.
- పందికోన గ్రామంలో ఒక్కొక్క గొర్రెల కాపరి కనీసం అయిదు నుంచి 10 కుక్కలను పెంచుకుంటున్నాడు. వారి గొర్రెలకు కుక్కలు కాపలా కాస్తుంటాయి.
- పందికోన కుక్కలకు గోర్లు , కళ్ళు, చెవులు ఇతరత్రా విభిన్నంగా ఉంటాయి. ఈ కుక్కలకు ప్రత్యేక ఆహారం అక్కరలేదు. సాధారణ తిండి చాలు.
- చాలాచోట్ల పోలీసులు కూడా పందికోన కుక్కలను తనిఖీల కోసం వినియోగిస్తుంటారు.
- నేర పరిశోధన విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పందికోన కుక్కలు సాయం చేస్తున్నాయి.
- ఒక్క హైదరాబాదులోనే పందికోన జాతి కుక్కలు వందకుపైగా ఉన్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లాంటి ఎందరో ప్రముఖులు ఈ కుక్కను పెంచుకుంటున్నారు.
- కర్నూలు జిల్లాలో పనిచేసిన ఎస్పీలు, కలెక్టర్లు బదిలీలపై వెళ్లిన చాలామంది అధికారులు ఇక్కడి కుక్కలను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. అమెరికా సహా కొన్ని విదేశాలలో నివసిస్తున్న పలువురు తెలుగువారు పందికోన కుక్కలను తీసుకెళ్లి (Pandikona Dogs) పెంచుకుంటున్నారు.