12 Cards For Voting : పోలింగ్ రోజున ఓటర్ ఐడీ కార్డు దొరకకపోతే ఎలా ? ఏం చేయాలి ? ఓటు వేసేందుకు ఎలా వెళ్లాలి ? మరేం లేదు.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యామ్నాయ కార్డులలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. దానితో వెళ్లి ఓటు వేసి రావచ్చు. ఆ ప్రత్యామ్నాయ కార్డుల ఆధారంగా ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారు. ఓటు అత్యంత ముఖ్యమైనది కాబట్టే కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు వెసులుబాటును కల్పిస్తోంది. మనం పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే అక్కడున్న సిబ్బంది .. ఓటర్ ఐడీ కార్డును చూపించాలని మనల్ని అడుగుతారు. ఎందుకంటే దానిపై మన పేరు, ఫొటో, ఎపిక్ నంబర్, ఇతర వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఓటరు ఐడీ ఉంటే.. ఓటు వేసేది నిజమైన వ్యక్తే అని కన్ఫార్మ్ అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ మన దగ్గర ఓటర్ ఐడీ కార్డు లేకపోతే.. నకిలీ ఓటరు కాదని మనం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 12 ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఐడీ కార్డులలో ఏదో ఒకదాన్ని పోలింగ్ బూత్ సిబ్బందికి చూపించొచ్చు. వాటిని చెక్ చేసి ఓటు వేసేందుకు మనల్ని లోపలికి పంపిస్తారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే వారి ఫొటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎంపీలు తమ ఐడీ కార్డులను చూపించి ఓటు వేయొచ్చు. స్వాతంత్ర్య సమరయోధులు (ఫ్రీడమ్ ఫైటర్), ఎక్స్-సర్వీస్మెన్ తదితరులు కూడా తమ ఐడెంటిటీ కార్డులను చూపించి ఓటేయొచ్చు. ఆయుధ లైసెన్స్ ఉన్న వారు కూడా దాన్ని చూపించి ఓటు(12 Cards For Voting) వేయొచ్చు.
ఓటర్ ఐడీకి ప్రత్యామ్నాయ కార్డులు ఇవే..
- ఆధార్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డు
- ఇండియన్ పాస్పోర్టు
- ఫొటోతో పోస్టాఫీస్ పాస్బుక్
- ఫొటోతో బ్యాంక్ పాస్బుక్
- ఫొటోతో పెన్షన్ డాక్యుమెంట్
- RGI స్మార్ట్ కార్డు
- కార్మిక శాఖ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు
- ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు
- ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన అధికార గుర్తింపు పత్రం
- దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు