Site icon HashtagU Telugu

US Nuclear Secrets : అమెరికా అణ్వాయుధ రహస్య పత్రాలను అపహరించిన ట్రంప్.. ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు

Donald Trump

Donald Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాఖలైన 49 పేజీల ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు చేశారు.

ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయాక.. 2021 సంవత్సరంలో వైట్ హౌస్ నుంచి వెళ్లే టైంలో తనతో పాటు అత్యంత రహస్యమైన అణ్వాయుధ రహస్య పత్రాలను(US Nuclear Secrets) తీసుకెళ్లారనే అభియోగాలను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయానని తెలియడంతో.. వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడాలోని తన ఇంటికి ట్రంప్ పంపిన కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో “వందల” రహస్య ప్రభుత్వ పత్రాలు ఉన్నాయని ఛార్జ్ షీట్ నివేదికలో ఆరోపించారు. వీటిలో అమెరికా న్యూక్లియర్ ఆయుధాల కీలక సమాచారం(US Nuclear Secrets).. రక్షణ శాఖ వ్యూహాలతో ముడిపడిన పత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా జాతీయ భద్రతకు ట్రంప్ అపాయం కలిగించేలా ప్రవర్తించారని అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు తీవ్ర నేరారోపణ చేశారు.

ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడల్లా వేలాది మంది హాజరవుతుంటారని.. అలాంటి చోట పెంటగాన్, CIA, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను తీసుకెళ్లి ట్రంప్ ఉంచారని ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు.

Also read :Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను బెడ్‌మిన్‌స్టర్, న్యూజెర్సీ, గోల్ఫ్ క్లబ్‌ ప్రాంతాల్లో వాటిని చూడటానికి అనుమతి లేని వ్యక్తులకు కూడా దాదాపు రెండు సందర్భాల్లో ట్రంప్ చూపించారని ఆరోపించారు.

ట్రంప్ పై మొత్తం 37 నేరారోపణలను అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చేశారు. అయితే వాటిలో 31 నేరారోపణలు.. “దేశ రక్షణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచడం” అనే అంశానికి సంబంధించినవి. ఈ 31 నేరారోపణలలో ఒక్కటి నిరూపితం అయి దోషిగా తేలినా 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది.

సీక్రెట్ డాక్యుమెంట్లను దాచిన వ్యవహారంలో.. అధ్యక్షుడిగా ఉన్న టైంలో ట్రంప్ కు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన వాల్ట్ నౌటా ను సహ కుట్రదారుడిగా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంట్లో ఉన్న బాల్‌రూమ్, బాత్రూమ్‌, బెడ్ రూమ్, స్టోర్ రూమ్ సహా వివిధ ప్రదేశాలలో అమెరికా సీక్రెట్ డాక్యుమెంట్స్ ను ట్రంప్ దాచడానికి వాల్ట్ నౌటా సహాయం చేశాడనే అభియోగాన్ని నమోదు చేశారు. దీనికి సంబంధించి వాల్ట్ నౌటా పై ఆరు నేరారోపణలు ఉన్నాయి.

ఈ కేసులో తొలిసారిగా విచారణ కోసం మంగళవారం (జూన్ 13న)  మధ్యాహ్నం 3:00 గంటలకు ట్రంప్ మియామీలోని కోర్టుకు హాజరుకానున్నారు.