తెలంగాణ (Telangana Assembly Elections) లో మరో రెండు , మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో పార్టీల తాలూకా అభ్యర్థులను డిసైడ్ చేసి..ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముహూర్తం బాగుందని చెప్పి బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తమ పార్టీ తాలూకా మొదటి విడుత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు. మొత్తం 115 మందితో కూడిన లిస్ట్ ను అధికారిక ప్రకటన చేసారు. అలాగే సీఎం కేసీఆర్ కామారెడ్డి , గజ్వేల్ స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేసారు. ఇక మొదటి నుండి చెపుతున్నట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించారు.
వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించారు. అయితే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తో పాటు బిజెపి నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.
గజ్వేల్‌లో ఓటమి తప్పదనే ఉద్ధేశ్యంతోనే కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని రేవంత్..కేసీఆర్ ఫై విమర్శలు కురిపించారు. కేసీఆర్‌కు షబ్బీర్ అలీ చేతిలో ఓటమి ఖాయమని, తాము మూడింతల రెండొంతుల మెజార్టీతో గెలుస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వాలని తాను సవాల్ చేశానని, కానీ చాలాచోట్ల అభ్యర్థులను మార్చారన్నారు. మంచి ముహూర్తం చూసుకొని జాబితాను విడుదల చేస్తామని చెప్పారని, కానీ ఆ సమయానికి మద్యంకు సంబంధించిన పని పెట్టుకున్నారని ఎద్దేవా చేసారు రేవంత్. కేసీఆర్ ప్రకటించిన జాబితా చూశాక కాంగ్రెస్‌కు, తెలంగాణ ప్రజలకు ఇక ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని అర్థమైందన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో.. ఖర్గే నేతృత్వంలో త్వరలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.
మరోపక్క బిఆర్ఎస్ జాబితా ఫై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) స్పందించారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను తప్పకుండా ఓడించి పంపిస్తామన్నారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కామారెడ్డికి వస్తున్నారని విమర్శించారు. తాను గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని తమ పార్టీకి చెందిన ఈటల రాజేందర్ ప్రకటించినప్పటి నుంచి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే కామారెడ్డికి పారిపోయి వస్తున్నారన్నారు. గజ్వేల్‌కు వస్తున్నానని ఈటల చెప్పడంతో దడ పుట్టిందన్నారు.
Read Also : 2023 Telangana Elections : బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించిన కేసీఆర్