Poster Politics : హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం.. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా రాతలు

Poster Politics : ఇంకాసేపట్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)  సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 09:58 AM IST

Poster Politics : ఇంకాసేపట్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మీటింగ్స్ లో దాదాపు వంద మంది కీలక కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు కూడా ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలతో కూడిన  పోస్టర్లు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వెలిశాయి. ‘‘కరప్ట్ వర్కింగ్ కమిటీ” అని ఆ పోస్టర్లపై రాశారు. పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)  సభ్యుల ఫొటోలను ప్రచురించారు. వారు కొన్ని స్కామ్ లు చేశారని ఆరోపించే వ్యాఖ్యలను కూడా పోస్టర్లపై ముద్రించడం గమనార్హం. వీటిలో ఫొటోలు ఉన్న నాయకుల జాబితాలో.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. ‘‘బివేర్ ఆఫ్ స్కామర్స్’’ అనే ట్యాగ్ లైన్ ను ఈ పోస్టర్లపై ప్రింట్ చేశారు.

Also read :US – Russia Friendship : భూమిపై కుస్తీ .. స్పేస్ లో దోస్తీ.. అమెరికా, రష్యా వెరైటీ సంబంధాలు

కాంగ్రెస్ నేతల ఆగ్రహం

హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు ఇలా పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను ధైర్యంగా ఎదుర్కోలేని పిరికిపందలే.. రాత్రికిరాత్రి దొంగచాటుగా ఈ పోస్టర్లను అతికించారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం టీపీసీసీ విందు అనంతరం సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుంది.  దీనికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక రానున్నారు.