AP & Telangana : 27న తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల‌తో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

కేంద్ర హోంశాఖ ఈ నెల 27న రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం కానుంది. తెలుగు రాష్ట్రాలకు

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 10:32 PM IST

కేంద్ర హోంశాఖ ఈ నెల 27న రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం కానుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై భేటీలో చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోం శాఖ.. ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్‌ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.