Fibernet : ఫైబర్‌నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్‌పై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టాయి. ఈ వివాదం పెరిగిపోకుండా, వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. దీనిలో భాగంగా, సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌లను వ్యక్తిగతంగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గురువారం నాడు జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు శుక్రవారం నాటికి పత్రికల్లో ప్రధానంగా ప్రచారం కావడంతో, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, దీనిపై స్పష్టతను తీసుకురావాల్సిన బాధ్యతను మంత్రి బీసీ జనార్దన రెడ్డికి అప్పగించారు.
ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, మంత్రి బీసీ జనార్దన రెడ్డి శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగారు. ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపిన అనంతరం, నేరుగా జీవీ రెడ్డిని ప్రశ్నించారు. “ఎందుకు మీడియా ముందు ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌పై రాజద్రోహం ఆరోపణలు చేశారని” అడిగారు. దీనికి జీవీ రెడ్డి తన వాదనను వివరించారు. గత కొంతకాలంగా దినేశ్‌కుమార్ తనకు సహకరించడం లేదని, తన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాట్సాప్ సందేశాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. చట్టపరమైన నియామక పత్రాలు లేని 410 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా వారిని కొనసాగిస్తూ జీతభత్యాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. అంతేగాక, ఇన్‌కమ్‌టాక్స్, జీఎస్టీ వంటి ఆర్థిక అంశాలపైనా స్పష్టమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్‌లకు కూడా వివరించానని మంత్రి దృష్టికి తెచ్చారు. ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా పటిష్టంగా మార్చాలంటే, ఎండీ దినేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని జీవీ రెడ్డి సూచించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, మంత్రి జనార్దన రెడ్డి జీవీ రెడ్డిని ఆధారాలతో కూడిన నివేదిక సమర్పించమని ఆదేశించారు. వెంటనే స్పందించిన జీవీ రెడ్డి, తన ఆధారాలతో కూడిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నానికి అందజేశారు.
శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్ కలిశారు. ఈ సమావేశానికి ఐ అండ్ ఐ కార్యదర్శి యువరాజ్ కూడా హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి, “మీకు, చైర్మన్‌కు మధ్య విబేధాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ శాఖల కీలక వ్యక్తులు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ ఏమవుతుందో ఆలోచించారా?” అంటూ ప్రశ్నించారు. దీనికి దినేశ్‌కుమార్ తన వాదన వినిపించారు. “గతంలో జీఎస్టీ వ్యవహారాలను చూసిన కన్సల్టెన్సీ సంస్థ ఫీజును తీసుకుంటున్నందున, చెల్లింపుల బాధ్యత ఆ సంస్థదే,” అని వివరించారు. ఆదాయపు పన్ను విషయంలోనూ ఇదే వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆయన వివరణను విన్న మంత్రి, లిఖితపూర్వకంగా ఆధారాలతో కూడిన నివేదికను సమర్పించమని ఆదేశించారు. దినేశ్‌కుమార్ కూడా దీనికి అంగీకరించి, శనివారం నాటికి నివేదిక అందజేస్తానని చెప్పారు.
ఈ పరిణామాలు రాజకీయ , పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను చైర్మన్లు మీడియా ఎదుట విమర్శించడం, పరిపాలనా విధానంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. కొందరు కార్పొరేషన్ ఎండీలు, “చైర్మన్లు అధికారాలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే, ఎండీలుగా రాజకీయ నేతలను నియమించుకోవచ్చు కదా?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, “మేము కార్యనిర్వాహణ అధికారాలను కోరుకోవడం లేదు,” అంటూ చైర్మన్లు సమర్థించుకుంటున్నారు.
ఫైబర్‌నెట్ వివాదం, అధికారుల మధ్య విభేదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా, మీడియా ముందు వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు శాశ్వత పరిష్కారానికి దారి తీస్తాయా? లేక మరిన్ని చర్చలకు దారి తీస్తాయా? అనేది చూడాల్సి ఉంది.
Read Also : IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..