పల్నాడు (Palnadu) జిల్లా దాచేపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన వీరంతా పులిపాడుకు కూలీ పని కోసం వెళ్తున్నారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు అంబులెన్సు సహాయంతో క్షతగాత్రులను స్థానిక గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: LSG vs MI: ముంబైకి మళ్ళీ షాకిచ్చిన లక్నో… ఉత్కంఠ పోరులో 5 రన్స్ తో విజయం
రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. లారీ ఢీకొనడంతో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతుల్లో ఎక్కువగా ఆటో ముందుభాగంలో కూర్చున్నవారు ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా మిర్చి కూలీ పనులకు ఆటోలో వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.