Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్ పులి.. మరి కేటీఆర్ సంగతేంటి..?

KCR and KTR, BRS

Kcrktr

By: డా. ప్రసాదమూర్తి

కేసీఆర్ ఆరోగ్యం (KCR Health) విషయం ఎప్పుడూ ఒక పజిల్ లాంటిదే. ఆయన ఆరోగ్యం మీద పలు రకాలు ఊహాగానాలు విహారం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్య సాగరంలో ముంచేయడం కేసిఆర్ కు తెలిసిన కనికట్టు విద్య. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి 50 రోజులు ముందే తెలంగాణ ఎన్నికల (Telangana Elections) బరిలో తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి దటీజ్ కేసీఆర్ అనిపించుకున్నారు. తమ పార్టీ తరఫున పోరాడే మల్ల యోధులు వీరేనని ప్రతిపక్షాలకు ముందుగానే తెలియజేసి, ఇంత ముందుచూపా.. అని నివ్వెరపోయేలా అందరినీ ఖంగు తినిపించిన వ్యూహ కర్త కేసిఆర్. ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల కేసీఆర్ (KCR) ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా లేక వికటిస్తాయా అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే మనకు అర్థమవుతుంది.

ఇదంతా అలా ఉంచితే, కేసిఆర్, ఒకపక్క దేశమంతా రాష్ట్రమంతా రాజకీయంగా అట్టుడికి పోతున్న సమయంలో కొన్నాళ్లు అదృశ్యం అయిపోయారు. ఆయన ఆరోగ్యం విషయంలో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటినుంచో తెలంగాణలో కుటుంబ పాలన మీద విరుచుకుపడుతున్నారు. మొన్నీమధ్య రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఆయన తనతో కేసీఆర్ (KCR) నెరపిన ప్రైవేటు సంభాషణ రహస్యాన్ని కూడా బయటపెట్టారు. ఆ సంభాషణ సారాంశం అంతా కేసిఆర్ తన కుమారుడైన కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని బలంగా కోరుకుంటున్న విషయమే.

ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనూ ప్రతిపక్షాలలోనూ ప్రజల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ (KTR) అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ తెలంగాణ కోసం కొట్లాడి, ప్రాణాలకు సైతం తెగించి నిలబడి రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్ స్థానంలో అతని తనయుడు కేటీఆర్ ని ప్రజలు ఊహించుకోగలరా అనేది ప్రజలకు ఎంత సందేహం ఉందో లేదో తెలియదు గాని, అధికార బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయని అర్థమవుతోంది. అందుకే ఈ ఊహాగానాలకు ఈ సందేహాలకు తెరదించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మూడోసారి తన తండ్రి కేసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక బలమైన బహిరంగ ప్రకటన చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రకటన ద్వారా ప్రజలకు, ప్రతిపక్షాలకు, తన సొంత పార్టీ వారికి ఏకకాలంలో ఆయన ఒక సంకేతాన్ని ఇచ్చినట్టయింది. ముఖ్యమంత్రి పదవికి తాను పోటీ పడటం లేదని, పార్టీలో గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మనసులో గాని ఆ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేసినట్లయింది. ఇలా స్పష్టం చేయడం ద్వారా కేటీఆర్ తెలంగాణలో ఏకైక మొనగాడు కేసీఆర్ అని ఆయన చెప్పదలుచుకున్నట్టు అర్థమవుతోంది. అంటే ఇంకా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్ ను ఊహించుకునే స్థితికి చేరుకోలేదని బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న కేసిఆర్ తనయుడే చెప్పడం విశేషం.

కేసిఆర్ అక్టోబర్ 15వ తేదీన తమ పార్టీ మేనిఫెస్టో (BRS Manifesto 2023) విడుదల చేసి, పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసి, ఎన్నికల ప్రచార సమరానికి శంఖారావం చేస్తారని అంటున్నారు. అంతేకాదు పులి బయటకు వస్తుందని, ఇక నక్కలన్నీ తొర్రల్లో దాక్కోవాల్సిందేనని కేటీఆర్ ప్రతిపక్షాల మీద వ్యంగ్య బాణాలు వేశారు. ఆయన చమత్కార ధోరణి, వ్యంగ్య నైపుణ్యం వినడానికి బాగానే ఉంది కానీ కేటీఆర్ వదిలిన బాణం అతని మీదకే తిరిగి దాడి చేసే ప్రమాదం ఉందన్న విషయం ఆయన గమనించారో లేదో కానీ పలువురు ఆ వ్యాఖ్యను హాస్యాస్పదంగా తిప్పి కొడుతున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని, యుద్ధ చతురతను కేటీఆర్ పుణికి పుచ్చుకోలేదని ఈ వ్యాఖ్య ద్వారా అర్థమవుతోంది. కేసిఆర్ ను పులిగా అభివర్ణించడం ద్వారా మిగిలిన ప్రతిపక్షాలను ఆయన ఎద్దేవా చేసినట్టు అనుకోవచ్చు.

కానీ కేసిఆర్ పులి అయితే ప్రతిపక్షాల మాట అటుంచి, ఆయన తనయుడుగా కాబోయే ముఖ్యమంత్రిగా జేజేలు అందుకుంటున్న కేటీఆర్ పరిస్థితి ఏంటి? కేసిఆర్ పులి సరే, తాను కాదని కేటీఆర్ ఒప్పుకోవడమే కదా అని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అంటే కేసిఆర్ తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎన్నికల బరిలో నిలిచి పోరాడాల్సిందే. ఇక మరో ఆప్షన్ లేదు. తను విశ్రాంతిలో ఉన్నా, రథాన్ని అధిరోహించి ముందుకు నడిపే శక్తి తన కుమారుడైన కేటీఆర్ కు లేదని చెప్పకనే చెప్తున్నారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాత్రమే పులి అయితే, మిగిలిన ప్రతిపక్షాల మాట అటుంచి బీఆర్ఎస్ పార్టీలో ఇతర నాయకులందరూ కూడా డమ్మీలే అన్న వెటకారం పలువురు చేసే అవకాశాన్ని కేటీఆర్ కల్పించారన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి.

అంతేకాదు కేసీఆర్ నవంబర్ తొమ్మిదో తేదీన సిద్దిపేట నియోజకవర్గంలోని కోనయపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, రెండు చోట్ల నామినేషన్ వేస్తారట. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసిఆర్ బరిలో దిగుతున్నారు. ఇలా రెండుచోట్ల కేసిఆర్ పోటీ చేయడం కూడా పార్టీలో తన గెలుపు అత్యంత ఆవశ్యకమని సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఏది ఏమైనప్పటికీ పులి పులే. మరి పులి పిల్ల మాట ఏమిటి అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న.

Read Also : Nara Lokesh : ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచార‌ణ‌.. రేపు మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌న్న సీఐడీ