Site icon HashtagU Telugu

Nuclear Weapons Race : ఆ మూడు దేశాలతో దడ.. అణ్వాయుధాలను పెంచుతాం: అమెరికా

Nuclear Weapons Race

Nuclear Weapons Race

Nuclear Weapons Race : ఉత్తర కొరియా, చైనా, రష్యాలు అణ్వాయుధ నిల్వలను వేగంగా పెంచుకుంటున్నాయని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది.  ఆ మూడు దేశాల తీరు మారకుంటే.. అమెరికా కూడా అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచక తప్పదని స్పష్టం చేసింది.  ‘‘ఉత్తర కొరియా, చైనా, రష్యాలు ఇరాన్‌తో కలిసి పశ్చిమాసియా ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ దేశాలు ఏకమై చేస్తున్న కుట్రలు అమెరికా భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఈనేపథ్యంలో అమెరికా కూడా అలర్ట్ కాక తప్పదు’’ అని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఆయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విభాగం సీనియర్ డైరెక్టర్ ప్రణయ్ వద్ది ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రణయ్ వద్ది చేసిన కామెంట్స్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

We’re now on WhatsApp. Click to Join

ఆ మూడు దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్ల వల్లే అమెరికా అణ్వాయుధాల నవీకరణ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్ పచ్చజెండా ఊపాల్సి వచ్చిందని ప్రణయ్ వద్ది చెప్పారు. అణ్వాయుధాలను తగ్గించాలనే నిబద్ధత అమెరికాకు ఉన్నా.. ఇతర దేశాల నుంచి దానిపై సహకారం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల వద్దనున్న అణ్వాయుధాల సంఖ్య మరింత పెరిగే ముప్పు ఉందన్నారు. ఉత్తర కొరియా, చైనా, రష్యాల నుంచి మిత్రదేశాలను రక్షించడానికి అమెరికా తన అణ్వాయుధ శక్తిని పెంచుకుంటుందని ప్రణయ్ వద్ది తెలిపారు. ఈవిషయంలో అమెరికా, దక్షిణ కొరియాల(Nuclear Weapons Race) మధ్య ఇప్పటికే స్పష్టమైన ఒప్పందం ఉందని గుర్తు చేశారు. మరో వైపు రష్యా కూడా అణ్వాయుధాలను తన సరిహద్దుల్లో మోహరించింది. ప్రత్యేకించి అణ్వాయుధాలతో ఉక్రెయిన్, పోలండ్ బార్డర్‌లలో ఆర్మీ డ్రిల్స్ కూడా నిర్వహిస్తోంది. అమెరికా, నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు సహాయాన్ని కొనసాగిస్తే.. వాటిపైకి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పుతిన్ వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read :Modi 3.0 Cabinet: టీడీపీ, జేడీయూల‌కు మూడేసి కేంద్ర మంత్రులు.. రేపు క్లారిటీ..?!