US Defence Chief : అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆరోగ్యం వివరాలపై పలు అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నిరోజులుగా ఇజ్రాయెల్ – గాజా యుద్ధంపై ఎప్పటికప్పుడు అమెరికా తరఫున మీడియాకు అప్డేట్స్ ఇచ్చిన ఆయనకు అకస్మాత్తుగా ఏమైంది ? లాయిడ్ ఆస్టిన్ ఆరోగ్యం స్థితిగతులను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు ? అనే దానిపై అంతర్జాతీయ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
గత సోమవారం నుంచి లాయిడ్ ఆస్టిన్ ఆస్పత్రిలో చికిత్స(US Defence Chief) పొందుతున్నారు. ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని పెంటగాన్ మీడియా కార్యదర్శి ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆస్టిన్ కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆస్టిన్ హాస్పిటల్లో చేరి ఐదు రోజులవుతున్నా పెంటగాన్ ఆ విషయాన్ని బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా అమెరికాలో అధ్యక్షుడు సహా కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరితే ఆ విషయాన్ని వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు. కానీ, ఆస్టిన్ విషయంలో అలా జరగలేదు. ఈ పరిణామంపై సాక్షాత్తూ పెంటగాన్ ప్రెస్ అసోసియేషన్ (పీపీఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: Plane Door Horror : 16,325 అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం కిటికీ
మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అగ్రరాజ్యం అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆరోగ్యం అకస్మాత్తుగా ఆందోళనకరంగా మారడం గమనార్హం.ఇటీవలి కాలంలో అనేక మంది అమెరికా మిలిటరీ సర్వీస్ సభ్యులకు వివిధ దేశాల నుంచి వార్నింగ్స్ పెరిగాయి. ఇలాంటి సమయంలో ఆస్టిన్ అనారోగ్యం గురించి పెంటగాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆందోళనకరమని పెంటగాన్ ప్రెస్ అసోసియేషన్ అంటోంది. దీనిపై అది ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది. ఈ పరిణామాలపై పెంటగాన్ మీడియా కార్యదర్శి ప్యాట్ రైడర్ స్పందిస్తూ.. గోప్యత, వ్యక్తిగత కారణాలతోనే ఆస్టిన్ ఆరోగ్యం వివరాలను బయటకు వెల్లడించలేదన్నారు.
రెండు మహా యుద్ధాల్లో అమెరికా..
ఇప్పుడు అమెరికా రెండు కీలక యుద్ధాల్లో ఇరుక్కుపోయింది. ఒకటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, రెండోది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం. గాజాపై పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు అందుతున్న ఆయుధాలన్నీ అమెరికావే. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నది కూడా అమెరికానే. ఈ క్రమంలోనే ఇటీవల ఇరాక్, సిరియాల్లో అమెరికా బలగాలు ఉన్న సైనిక స్థావరాలపై ఇరాన్ సపోర్ట్ కలిగిన మిలిటెంట్ గ్రూపులు డ్రోన్, క్షిపణి దాడులను పెంచాయి. మరోవైపు యెమన్ హౌతీలపై దాడులు చేయడానికి అమెరికా సహా మొత్తం 12 దేశాల కూటమి రెడీ అవుతోంది. దీంతో అక్కడ మరో యుద్ధానికి అమెరికా తెర తీయబోతోంది. ఇలాంటి టైంలో అమెరికా రక్షణ మంత్రి ఆరోగ్యం విషమంగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.