Dussehra Special : సంక్రాంతి అంటే కోస్తాంధ్ర జిల్లాలు ఫేమస్ !! ఓనం అంటే కేరళ ఫేమస్ !! దసరా సెలబ్రేషన్స్ కు దేశంలోని 6 ప్రదేశాలు ఫేమస్ !! గుజరాత్ లోని అహ్మదాబాద్, వడోదర.. ఛత్తీస్‌గఢ్ లోని జగదల్పూర్.. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా.. రాజస్థాన్ లోని కోట.. కర్ణాటకలోని మైసూర్.. హిమాచల్ ప్రదేశ్ లోని కులులో జరిగే దసరా వేడుకలు మనదేశంలోనే చాలా స్పెషల్ . ఇంతకీ అక్కడి వేడుకల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ లో..
గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తారు. ముఖ్యంగా అహ్మదాబాద్, వడోదరలలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరుగుతాయి. డోలు బాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు నృత్యాలు చేస్తారు. అమ్మవారికి నిర్వహించే ‘గుజరాతీ హారతి’ నృత్యం తప్పకుండా చూడాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఛత్తీస్‌గఢ్ లో..
ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు 75 రోజుల పాటు దసరా వేడుకలు నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా దంతేశ్వరి దేవి (ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ గిరిజనుల దేవత), ఇతర దేవతల గౌరవార్థం నిర్వహిస్తారు. 75 రోజుల్లో పాత జాతర, కచనగాడి, నిషా జాతర వంటి అనేక ఆచారాలను నిర్వహిస్తుంటారు. రథం ఊరేగింపులు, బస్తర్‌లోని వివిధ దేవతల జగదల్పూర్ సందర్శన, గిరిజన పెద్దల సమావేశం, కృతజ్ఞతా వేడుకలు నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో కాకతీయ రాజు పురుషోత్తం దేవ్ ఒడిశాలోని పూరీకి తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చిన తర్వాత ఈ పండుగ ప్రారంభమైందని స్థానిక చరిత్ర చెబుతోంది. వేడుకల్లో భాగంగా చెట్లను ఆరాధిస్తారు.
బెంగాల్ లో..
బెంగాల్ ప్రజలు దసరా పండుగను దుర్గా పూజ పేరుతో జరుపుకుంటారు. కోల్‌కతా నగరమంతా పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క మండపానికి ఒక్కో ప్రత్యేక థీమ్ ఉంటుంది. ‘బొనెది బరీ’ పేరుతో కోల్‌కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తారు.
రాజస్థాన్ లో..
రాజస్థాన్‌లోని కోట నగరంలో ప్రతి సంవత్సరం 25 రోజుల పాటు దసరా జరుపుకొంటారు. నగరంలోని దసరా ‘మేళా’ మైదానంలో జాతర సందర్భంగా లక్షలాది మంది సందర్శకులు వస్తారు. పండుగ ముగింపు సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావణ విగ్రహాలను దహనం చేస్తారు. చంబల్ నది ఒడ్డున ఘనంగా జాతర జరుగుతుంది.
కర్ణాటకలో..
కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా వేడుకలకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు తరలివస్తారు. ఇక్కడి దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకూ ప్రతీకగా నిలుస్తాయి. నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.
హిమాచల్ ప్రదేశ్ లో..
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు దసరా వేడుకలకూ ప్రత్యేకమే. కులులోని ధలపూర్ మైదానంలో రఘునాథ రథయాత్ర నిర్వహిస్తారు. సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200 పైగా విగ్రహాలను ఈ సందర్భంగా ఊరేగిస్తారు. 1637లో రాజా జగత్ సింగ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్చుతూ ‘లంకా దహనం’ (Dussehra Special) నిర్వహిస్తారు.