Site icon HashtagU Telugu

SRH vs DC: ఎట్టకేలకు సన్ రైజర్స్ గెలుపు బాట… హైస్కోరింగ్ గేమ్ లో ఢిల్లీపై విజయం

SRH vs HCA

SRH vs HCA

SRH vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఢిల్లీపై సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఆసక్తికరంగా సాగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది మూడో విజయం.

మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ లో అభిషేక్ శర్మ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. మయాంక్ 5 , త్రిపాఠీ 10 రన్స్ కు ఔటవగా.. కెప్టెన్ మర్క్ రమ్ కూడా నిరాశపరిచాడు. ఇక 13.5 కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ మళ్ళీ విఫలమయ్యాడు. మిఛెల్ మార్ష్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచాడు. అభిషేక్ శర్మ కేవలం 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీతో సన్ రైజర్స్ భారీస్కోర్ సాధించింది. తన ఫామ్ కొనసాగిస్తూ క్లాసెన్ కేవలం 27 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 21 బంతుల్లో 28 , హుస్సెన్ 10 బంతుల్లో 16 పరుగులు చేశారు. దీంతో సన్ రైజర్స్ 197 పరుగుల స్కోర్ సాధించింది. మిఛెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు.

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ డకౌటయ్యాడు. అయితే ఫిల్ సాల్ట్ , మిఛెల్ మార్ష్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. భారీ షాట్లతో సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫలితంగా పవర్ ప్లేలో ఢిల్లీ 57 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరూ దూకుడుగా ఆడారు. రెండో వికెట్ కు వీరి జోడి 11.2 ఓవర్లలో 112 పరుగులు చేసింది. సాల్ట్ 35 బంతుల్లో 59 , మిఛెల్ మార్ష్ 39 బంతుల్లో 1 ఫోర్ , 6 సిక్సర్లతో 63 పరుగులు చేశారు. అయితే సన్ రైజర్స్ స్పిన్నర్ల ఎంట్రీతో మ్యాచ్ మలుపు తిరిగింది. వెంటవెంటనే మార్ష్ , సాల్ట్ ఔటవడంతో ఢిల్లీ ఒత్తిడికి లోనైంది. తర్వాత బ్యాటర్లు వేగంగా ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. మనీశ్ పాండే , ప్రియమ్ గర్గ్ , ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ కూడా విఫలమయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించినా మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులే చేయగలిగింది. దీంతో వరుస పరాజయాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది.