Sunita Williams : బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఇవాళ జరగాల్సిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రయోగం ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. వాస్తవానికి బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8.04 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే లిఫ్ట్ ఆఫ్‌కు 90 నిమిషాల ముందు.. అట్లాస్ V రాకెట్‌తో జరిపే ఈ ప్రయోగాన్ని రద్దు చేశారు. ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్‌లో సమస్య ఉందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించడంతో ప్రయోగం ఆగిపోయింది. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో నాసాకు చెందిన బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్‌ను(Sunita Williams) పంపాలని ప్రణాళిక రచించారు. ప్రయోగం నిర్వహించడం ప్రస్తుతానికి ఇబ్బందికరమని గుర్తించడంతో వారిద్దరిని స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్ నుంచి బయటకు పిలిపించారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రయోగ ప్రణాళిక ఇదీ..
- ఈ ప్రయోగంలో సునీత మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నారు.
- సునీత, విల్మోర్ కలిసి స్పేస్ క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకొని.. అక్కడ వారం పాటు బస చేయనున్నారు.
- ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
- ప్రస్తుతం స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది.
- స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.
- ఈ యాత్రలో తనతో పాటు గణనాథుడి విగ్రహాన్ని తీసుకెళ్తానని సునీతా విలియమ్స్ ప్రకటించడం భారతీయులందరినీ ఆకట్టుకుంది.
- ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉందని సునీతా అన్నారు.
- రోదసిలో సమోసాను తినడం అంటే తనకు ఇష్టమని సునీత చెప్పారు.
- సునీత ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు.
- ఇంతకుముందు అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు.
- గతంలో ఆమె 2006, 2012 సంవత్సరాల్లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.