Site icon HashtagU Telugu

Israel Vs South Africa : అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. ఎందుకు ?

Gaza

Gaza

Israel Vs South Africa : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు 21వేల మందికిపైగా సామాన్య పౌరులు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించింది. ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ మారణకాండను సాగిస్తోందని దక్షిణాఫ్రికా ఆరోపించింది. గాజాలోని పాలస్తీనా ప్రజలను అంతం చేయడం లేదా అక్కడి నుంచి పారదోలడం  అనే దురుద్దేశాలతో ఇజ్రాయెల్ ఈ మారణకాండను చేస్తోందని తన పిటిషన్‌లో పేర్కొంది. 1948 నాటి జాతి నిర్మూలన ఒప్పందాన్ని ఉల్లంఘించి నడుచుకుంటున్న ఇజ్రాయెల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం(Israel Vs South Africa) కోరింది.

We’re now on WhatsApp. Click to Join.

తమపై అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం వేసిన కేసును ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఆ ఆరోపణలలో వాస్తవికత లేదని స్పష్టం చేసింది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించిన ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లియోర్ హైయాట్.. ‘‘మా దేశం గాజాలో మారణకాండ చేస్తోందనే దక్షిణాఫ్రికా ఆరోపణలలో నిజం లేదు. ఆ అభియోగాలను ఖండిస్తున్నాం. ఆధారాలు లేని ఆరోపణలు అవి. వాటిలో వాస్తవికత లేదు. చట్టబద్ధత కూడా లేదు’’ అని పేర్కొన్నారు. కాగా, నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది.

Also Read: Fight With Partner : భార్యాభర్తల గొడవ.. ఆ టైంలో ఈ పదాలు వాడొద్దు సుమా!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభమైంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్.. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపింది. అప్పటి నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. గాజా, ప్రపంచం నుంచి హమాస్ తొలగించబడే వరకు యుద్ధం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు 21,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.