Site icon HashtagU Telugu

Food Crisis : గాజాలో ఆహార సంక్షోభం.. ఆకలి తీరుస్తున్న కలుపుమొక్క గురించి తెలుసా ?

Food Crisis

Food Crisis

Food Crisis : ఇజ్రాయెల్‌ అమానవీయంగా  అక్టోబరు 7 నుంచి జరుపుతున్న వైమానిక, భూతల దాడుల కారణంగా పాలస్తీనాలోని గాజా ప్రాంతం బూడిద కుప్పలా మారింది. తీవ్ర ఆహార కొరత కారణంగా గాజాలోని పిల్లలు, పెద్దలు, ముసలివారు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాలను ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలోకి అనుమతించడం లేదు. దీంతో గాజా ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు కలుపు మొక్కలు తింటున్నారు. స్థానికంగా పెరిగే మాలో అనే కలుపు మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని గాజా ప్రజలు వాపోతున్నారు. గాజాలోని కఠినమైన పొడి నేల ఉన్న ప్రాంతాల్లో మాలో అనే కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. ఇవే ఇప్పుడు గాజా ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. ఆ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని గాజా పౌరులు విశ్వసిస్తారు. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలోకి నిత్యావసరాల సప్లై ఆగిపోయింది.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఉత్తర గాజా ప్రాంతంలో నీరు, ఆహారం, ఔషధాల కొరత ఏర్పడింది. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా ఉన్న తాము మరో గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సి వస్తోందని గాజన్లు చెబుతున్నారు. తమ పిల్లలకు కూడా కలుపు మొక్కలనే తినిపిస్తున్నట్లు తెలిపారు. గాజాలోని 23 లక్షల మంది జనాభాలో 80 శాతం మంది యుద్ధం కారణంగా తమ ఇళ్లను వదిలేసి వలస వెళ్లాల్సి వచ్చింది. ఈజిప్టుతో సరిహద్దు కలిగి ఉన్న రఫా నగరంలో ఏకంగా 14 లక్షల మంది గాజా ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఆ నగరంపైనా వైమానిక దాడులను చేస్తూ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను కాలరాస్తోంది.

Also Read : SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..

గాజాలోని 22 లక్షల మంది ప్రజలు కరువు అంచున ఉన్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గాజాలోని జబాలియా అనే నగరంలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా సిటీలోని ఆస్పత్రిలో పోషకాహార లోపంతో రెండు నెలల పాప చనిపోయింది. ఈ యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు కనీసం 29,606 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆహార కొరత కారణంగా సరఫరా తగ్గిపోయింది. దీంతో వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో బియ్యం ఏడు షెకెళ్ల ( దాదాపు 121 రూపాయలు) నుంచి 55 షెకెళ్లకు ( దాదాపు 1260 రూపాయలు ) పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్లం కాబట్టి ఎలాగో అలా ఆకలిని ఓర్చుకోగలం కానీ.. చిన్నపిల్లలు ఆకలిని ఎలా తట్టుకుంటారని తడారిన గొంతులతో ప్రశ్నిస్తున్నారు అక్కడి బాధితులు. వైమానిక దాడులతో కాకుండా ఆకలితో చనిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం కారణంగా పిల్లల్లో ఆకలి చావులు పెరగవచ్చని యూనిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది.