Site icon HashtagU Telugu

RR vs PBKS: राగెలిచి నిలిచిన రాజస్థాన్… ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం

PBKS vs RR

Rr Vs Pbks

RR vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో మరో జట్టు కథ ముగిసింది. పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత మ్యాచ్ ఓటమితోనే దాదాపుగా లీగ్ నుంచి ఔటైన పంజాబ్ తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ధావన్ , ప్రభ్ సిమ్రన్ త్వరగానే ఔటయ్యారు. ఫామ్ లో ఉన్న ప్రభ్ సిమ్రన్ సింగ్ తో పాటు అధర్వ, లివింగ్ స్టోన్ కూడా నిరాశపరిచారు. దీంతో పంజాబ్ 50 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. అతనితోపాటు శామ్ కర్రాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి రెండు ఓవర్ల వరకు పంజాబ్ అంత స్కోరు చేసేలా కనిపించలేదు. అయితే 19వ ఓవర్లో యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్ ను ఆటాడుకున్నాడు. షారుఖ్ ఖాన్ 41 రన్స్ తో రాణించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లు ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా చెరో వికెట్‌ తీసుకున్నారు.

ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడింది. బట్లర్ డకౌట్ అయినప్పటకీ రన్ రేట్ పెంచుకోవడమే లక్ష్యంగా మెరుపు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్, దేవ్ దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ 73 పరుగులు జోడించారు. అయితే హాఫ్ సెంచరీల తర్వాత వీరిద్దరూ ఔటవడం.. సంజూ శాంసన్ కూడా నిరాశపరచడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఈ దశలో హిట్ మెయిర్ మరోసారి మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. హిట్ మెయిర్ ఔటైనప్పటకీ.. రియాన్ పరాగ్ , ధృవ్ జురెల్ కూడా ధాటిగా ఆడారు. చివరికి రాజస్థాన్ 19.4 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. అయితే 18.3 ఓవర్లలో టార్గెట్ ఛేదించి ఉంటే బెంగళూరు రన్ రేట్ ను అధిగమించి ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఓడిపోవడంతో పాటు ముంబై కూడా ఓడితే రాజస్థాన్ కు అవకాశముంటుంది.