బెలూన్ కూల్చివేసిన సంఘటన పై చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశమే తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. త్వరలో తాను చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో మాట్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్‌ను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ బెలూన్ నిఘా కోసం ఉద్దేశించినదని అమెరికా ఆరోపించగా ఈ ఆరోపణను చైనా తోసిపుచ్చింది. అది వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించిన బెలూన్ అని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది.
‘‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేను మాట్లాడొచ్చు. మేం ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవట్లేదు. అయితే..బెలూన్ కూల్చివేత ఘటనపై క్షమాపణలు చెప్పే ఉద్దేశమే నాకు లేదు. అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకూ అమెరికా తన గగనతలంలో మొత్తం నాలుగు గుర్తుతెలియని వస్తువులను కూల్చేసింది. వాటిలో ఒకటి చైనా బెలూన్ కాగా.. మిగతా మూడింటి విషయంలో అమెరికా సైన్యం పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత