GT vs MI: హోంగ్రౌండ్ లో గుజరాత్ జోరు… ఛేజింగ్ లో మళ్ళీ చేతులెత్తేసిన ముంబై

ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ ను 55 పరుగుల తేడాతో నిలువరించింది.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 11:31 PM IST

GT vs MI: ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ ను 55 పరుగుల తేడాతో నిలువరించింది. బ్యాటింగ్ లో గిల్, మిల్లర్ , అభినవ్ మనోహర్ అదరగొడితే.. బౌలింగ్ లో సమిష్టిగా రాణించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. సాహా 4 , కెప్టెన్ హార్థిక్ పాండ్యా 13 పరుగులకే ఔటయ్యారు. విజయ్ శంకర్ కూడా తక్కువ స్కోరుకే ఔటవడంతో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ శుభ్ మన్ గిల్ ధాటిగా ఆడాడు. కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 56 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ ఔటయ్యేటప్పటకి గుజరాత్ స్కోర్ కవీసం 160 అయినా దాటుతుందా అనిపించింది. ఈ దశలో డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు.

వీరిద్దరూ నాలుగో వికెట్ కు 5.5 ఓవర్లలోనే 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిల్లర్ కేవలం 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46, అభినవ్ కేవలం 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశారు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన తెవాటియా కూడా మెరుపులు మెరిపించాడు. తెవాటియా కేవలం 5 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం మీద పడుతూ లేస్తూ సాగిన గుజరాత్ ఇన్నింగ్స్ ను ముంబై తన చెత్త డెత్ బౌలింగ్ తో భారీస్కోరు చేసేందుకు అవకాశమిచ్చింది. ఫలితంగా గుజరాత్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ముంబై పేలవమైన బౌలింగ్ కారణంగా గుజరాత్ చివరి 6 ఓవర్లలో 94 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ ను గుజరాత్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. తొలి మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులే వచ్చాయంటే వారి బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ 2 , ఇషాన్ కిషన్ 13 పరుగులకే ఔటవగా.. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మ కూడా నిరాశపరిచాడు. ఒకవైపు కామెరూన్ గ్రీన్ భారీ షాట్లు ఆడుతున్నా… మిగిలిన బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించారు. గ్రీన్ 33 పరుగులకు ఔటైన వెంటనే టిమ్ డేవిడ్ డకౌవడంతో ముంబై 5 వికెట్లు చేజార్చుకుంది. సూర్యకుమార్ యాదవ్ 23 రన్స్ కు ఔటయ్యాడు.

తర్వాత వధీరా ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగిపోవడంతో ముంబై ఒత్తిడికి లోనై వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ 9 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 , నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది ఐదో విజయం కాగా ముంబైకి నాలుగో ఓటమి.