Cyclone Mandous: తీవ్రతుపానుగానే మాండూస్‌.. పలు జిల్లాల్లో అలెర్ట్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ప్రభావం కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - December 10, 2022 / 12:33 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ తుపాను ప్రస్తుతానికి శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. మాండూస్‌ తుఫాన్‌ గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాన్‌ తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మాండూస్’ తుపాను ప్రభావంతో రానున్న రెండురోజులు దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.అలాగే ప్రకాశం, నెల్లూరు,తిరుపతి,చి త్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. వర్షాలు,భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. తుఫాను పట్ల రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. KS జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.