Site icon HashtagU Telugu

Plane In Flames : మంటల్లో విమానం.. 367 మంది బిక్కుబిక్కు.. ఐదుగురి మృతి ?

Plane In Flames

Plane In Flames

Plane In Flames : సోమవారం భూకంపంతో వణికిపోయిన జపాన్‌లో మంగళవారం మరో పెను ప్రమాదం తప్పింది. రాజధాని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో ఉన్న రన్‌వేపై జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం(ఫ్లైట్ నంబర్‌ JAL 516) ల్యాండ్ కాగానే వేగంగా దూసుకెళ్లి.. సమీపంలోని కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. JAL 516 విమానం ఎగువ భాగానికి మంటలు అంటుకున్నాయి. విమానం టాప్ నుంచి కిటికీలకు మంటలు వ్యాపించాయి. విమానం కిటికీల లోపలి నుంచి బయటికి మంటలు వెల్లువెత్తడం కనిపించింది. చుట్టూ మంటలున్నా.. పైలట్ సాహసోపేతంగా వ్యవహరించి విమానాన్ని అగ్నిమాపక టీమ్స్ ఉండే చోటుకు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాడు. ఈ సమయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో దాదాపు 367 మంది ప్రయాణికులు(Plane In Flames) ఉన్నారు. వెంటనే 70 వాహనాల్లో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది విమానానికి అంటుకున్న మంటలను నీటితో ఆర్పేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాదానికి గురైన ‘JAL 516 విమానం’లోని 367 మంది ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. ఎలాగోలా వారందరినీ  అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్‌తో రక్షించి బయటకు తీశాయి. ప్రమాదానికి గురైన విమానం ఉత్తర జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో ఉన్న సపోరో విమానాశ్రయం నుంచి టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బహుశా విమానంపై పైలట్ అదుపు కోల్పోవడం వల్ల అది వేగంగా దూసుకెళ్లి అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Drivers Strike Effect : హైదరాబాద్‌ బంకుల్లో నో స్టాక్.. ట్రక్కు డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. ఎందుకీ సమ్మె ?

ఈ ప్రమాదంతో ఎయిర్ పోర్టు ప్రాంగణాన్ని  నారింజ రంగు మంటలు, నల్లటి మేఘాలు ఆవరించాయి. JAL 516 విమానం ఢీకొట్టిన టైంలో కోస్ట్ గార్డ్ విమానంలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారని సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌లో తీవ్రమైన విమాన ప్రమాదాలేవీ చోటుచేసుకోలేదు. 1985లో టోక్యో నుంచి ఒసాకా నగరానికి వెళ్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ జంబో జెట్ సెంట్రల్ గున్మా ప్రాంతంలో కూలిపోయింది. దీంతో 520 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. అది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.