Site icon HashtagU Telugu

Israel Vs Gaza : గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ

Israeli Soldiers

Israel Vs Gaza

Israel Vs Gaza : ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన అల్-షిఫా ఆసుపత్రిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఈ ఆస్పత్రి చుట్టూ మోహరించి ఉన్నాయి. ‘‘ఆస్పత్రి కాంపౌండ్‌లో ఏ వ్యక్తి కనిపించినా ఇజ్రాయెల్ సైనికులు దాడి చేస్తున్నారు. ఇప్పుడు అల్-షిఫా హాస్పిటల్ లోపల కరెంటు లేదు. ఇద్దరు శిశువులు చికిత్స అందక చనిపోయారు. మరో 37 మంది శిశువుల ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి’’ అని అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ ముహమ్మద్ అబు సల్మియా తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని మహదీ ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. పాలస్తీనా రెడ్  క్రీసెంట్ సొసైటీ కథనం ప్రకారం.. గాజాలోని చిన్నారులు పాలు అందక తీవ్ర డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు.  విద్యుత్తు అంతరాయం, పరిసరాల్లో తీవ్రమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు. ‘‘దయచేసి గాజాలోని పిల్లలను రక్షించండి. ఇంత జరుగుతున్నా చూస్తూ ఎలా కూర్చోగలుగుతున్నారు’’  అంటూ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో రోకా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో గాజాలో చనిపోయిన వారి సంఖ్య 11,078కి చేరింది. వీరిలో 4,506 మంది పిల్లలు, 3,027 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్‌తో గాజాలోకి చొచ్చుకు వచ్చాక.. గత మూడు రోజుల్లో దాదాపు 2 లక్షల మంది పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస వెళ్లిపోయారు. న్యూయార్క్, లండన్, పారిస్, బాగ్దాద్, కరాచీ, బెర్లిన్, ఎడిన్‌బర్గ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయినా యుద్ధాన్ని విరమించేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. యుద్ధం తర్వాత గాజాను తామే కంట్రోల్‌ చేస్తామని వెల్లడించింది. గాజాను కంట్రోల్ చేసేందుకు తమకు ఇతర దేశాల సాయం అక్కర్లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Israel Vs Gaza) స్పష్టం చేశారు.

Also Read: Semi Final Match: సెమీ ఫైనల్ మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారితే ఎలా..? రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం వస్తే ఎలా..?