Israel Vs Syria : ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన గోలన్ హైట్స్ ప్రాంతం నుంచి సిరియా బార్డర్ లోని ఆర్మీ స్థావరాలపై దాడికి పాల్పడింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ కు చెందిన యుద్ధ విమానాలు సిరియాలోకి చొరబడి.. సిరియా ఆర్మీకి చెందిన మోర్టార్ లాంచర్లను ధ్వంసం చేశాయి. ఈవివరాలను ఇజ్రాయెల్, సిరియా సైన్యాలు ధ్రువీకరించాయి. అంతకుముందు గత ఆదివారం సిరియా రాజధాని డమస్కస్, అలెప్పోలోని రెండు ప్రధాన విమానాశ్రయాలపై కూడా ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేసింది. దీంతో ఆ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న దాడులు కలకలం క్రియేట్ చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
సిరియాలోని ఆర్మీ బేస్ ల నుంచి దాడులు జరగొచ్చనే సమాచారంతో ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడులు చేస్తోందని(Israel Vs Syria) తెలుస్తోంది. ఇప్పటికే యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులు, లెబనాన్ లోని హిజ్బుల్లా ఉగ్రవాదులు, గాజాలోని హమాస్ ఉగ్రవాదుల ముప్పేట దాడితో ఇజ్రాయెల్ ఆర్మీ పెనుసవాలును ఎదుర్కొంటోంది. ఇక సిరియా నుంచి కూడా దాడి మొదలైతే ఇజ్రాయెల్ మరింత ఒత్తిడికి లోను కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిరియా ఆర్మీకి ఆయుధాలను ఇరాన్ సప్లై చేస్తోంది.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇరాన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతామని ఇరాన్ పదేపదే వార్నింగ్స్ ఇస్తోంది. దీంతో భయాందోళనకు గురవుతున్న ఇజ్రాయెల్ .. సిరియా నుంచి దాడి జరగొచ్చనే కలవరంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈవిధంగా సిరియా ఆర్మీపై దాడులు చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.