Site icon HashtagU Telugu

Iran Attack : ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో ఇరాన్ ఎటాక్.. నిజమేనా ?

Iran Attack

Iran Attack

Iran Attack : ఇజ్రాయెలీ వైమానిక స్థావరంపై ఇరాన్‌ సైన్యం మిస్సైల్స్ ఎటాక్‌ను సిమ్యులేట్ (అనుకరణ) చేసింది. పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలోని ఒక యుద్ధనౌక నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఇరాన్‌ నేవీ(Iran Attack) సంధించింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా విడుదల  చేసింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న పాల్మాచిమ్‌ వైమానిక స్థావరానికి సమానమైన దూరంలో ఉన్న ఇరాన్‌లోని ఒక ఎడారి లక్ష్యంగా  ఈ ఎటాక్‌ను సిమ్యులేట్ చేశారు. ఎడారిలోని నిర్దేశించిన లక్ష్యం వద్ద తమ  మిస్సైళ్లు పడ్డాయని ఇరాన్ సైన్యం తెలిపింది. పాల్మాచిమ్‌ వైమానిక స్థావరం కీలకమైన సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంది. దీనికి సమీపంలోనే దేశ రాజధాని టెల్ అవీవ్ కూడా ఉంది.  గత నెలలో పాల్మాచిమ్‌ ఎయిర్ బేస్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ‘‘ఇరాన్‌పై దాడి చేసేందుకు కూడా మేం వెనుకాడం’’ అని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పాల్మాచిమ్‌ ఎయిర్ బేస్‌ లక్ష్యంగా మిస్సైల్ ఎటాక్‌ను సిమ్యులేట్ చేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గాజా – ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఈ తరహా దాడిని సిమ్యులేట్ చేయడం ఇదే తొలిసారి. దీనికి ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. ఈ దాడిపై ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ) కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామి మాట్లాడుతూ.. ‘‘యుద్ధనౌక నుంచి మేం సుదూర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాం. ఇది మా సైన్యం తొలి విజయం. మా నౌకాదళం సామర్థ్యాలను ఇజ్రాయెల్ ఎదుట ప్రదర్శించాం’’ అని వెల్లడించారు. ఈ సిమ్యులేషన్‌ ఎటాక్‌కు సంబంధించిన వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియాలోనూ ప్రసారం చేయడం గమనార్హం.

Also Read :Meta – Google – Microsoft : నకిలీ పొలిటికల్ కంటెంట్‌‌‌పై పోరు.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ జట్టు

సిమ్యులేషన్ జరిగిందిలా.. 

వివిధ రకాల క్షిపణులు, డ్రోన్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ‘షాహిద్ మహదవి’ యుద్ధనౌక నుంచి రెండు దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్  ఆర్మీ ఈ సిమ్యులేషన్ ఎటాక్ చేసిందని వీడియో ఫుటేజీని బట్టి స్పష్టమవుతోంది.  ఈ రెండు క్షిపణులు పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి 1,700 కి.మీ దూరంలో ఉన్న ఇరాన్‌లోని ఒక  ఎడారిలో ఏర్పాటుచేసిన లక్ష్యం వద్ద పడ్డాయి. సరిగ్గా ఇంతే (1700 కి.మీ) దూరంలో ఇజ్రాయెల్‌లోని పాల్మాచిమ్‌ వైమానిక స్థావరం ఉందని ఇరాన్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయెల్ దూకుడును తగ్గించకపోతే తమ మిస్సైళ్లు నిజంగానే  తగిన బుద్ధి చెబుతాయని వార్నింగ్ ఇచ్చింది.