IPL Finals @Modi Stadium: మోదీ స్టేడియం ప్రత్యేకతలేంటో తెలుసా

ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనుండగా..

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 05:30 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనుండగా.. తొలి సీజన్‌తోనే ఫైనల్‌కు దూసుకొచ్చిన గుజరాత్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అదే సమయంలో రాయల్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. వెరసి మరొక హోరాహోరీ పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ స్టేడియానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఈ స్టేడియాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మైదానంగా పిలిచేవారు. మొతెరా పట్టణంలో ఉండటంలో మొతెరా స్టేడియంగా ప్రసిద్ధికెక్కింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ స్టేడియాన్ని అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.

మొదట్లో 50 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని ఇప్పుడు లక్షా 30 వేల సామర్థ్యానికి పెంచారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న క్రికెట్ స్టేడియాల్లో అత్యధిక సామర్థ్యం ఉన్న స్టేడియం ఇదే. ఓవరాల్ లో నార్త్ కొరియాలోని రన్ గ్రాడో మే డే స్టేడియం తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టేడియంగా నిలిచింది. మొత్తం 63 ఎకరాల్లో ఈ స్టేడియం విస్తరించి ఉండగా.. ఆధునీకరణ కోసం 800 కోట్ల రూపాయలు వెచ్చించింది.