Denmark – Quran : ఇస్లాం మత పవిత్ర గ్రంధం ఖురాన్‌ను దహనం చేసిన ఎన్నో ఘటనలు గతంలో డెన్మార్క్‌లో చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై ముస్లిం దేశాలు ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర మతాల పవిత్ర గ్రంధాలను అవమానించే నిరసనలను కట్టడి చేయాలని డెన్మార్క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఖురాన్‌ను దహనం చేసిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా డెన్మార్క్‌లోని ముస్లింలు కూడా వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈనేపథ్యంలో డెన్మార్క్ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఖురాన్‌ను దహనం చేసే నిరసన కార్యక్రమాలపై బ్యాన్‌ను విధించాలనే ప్రతిపాదనలతో ప్రత్యేక బిల్లును రూపొందించారు. ఈ బిల్లుపై ఇవాళ డెన్మార్క్ పార్లమెంటులో చర్చ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఖురాన్‌ను దహనం చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలనే నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లును డెన్మార్క్‌లోని పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు, మీడియా ప్రముఖులు విమర్శిస్తున్నారు. దీనికి పార్లమెంటు ఆమోదం లభిస్తే.. 2017లో డెన్మార్క్ రద్దు చేసిన దైవదూషణ చట్టం తిరిగి వచ్చినట్టు అవుతుందని (Denmark – Quran) వ్యాఖ్యానిస్తున్నారు. డెన్మార్క్ పోలీసు విభాగం ప్రకారం.. ఈ సంవత్సరం జూలై 21 నుంచి అక్టోబర్ 24 మధ్యకాలంలో డెన్మార్క్‌లో 483 సార్లు ఖురాన్‌ను దహనం చేసి వేర్వేరు చోట్ల కార్యక్రమాలను నిర్వహించారు.