Crypto King – Fraud : అతడి పేరు సామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్. అమెరికాలో 2019 సంవత్సరంలో FTX అనే క్రిప్టో ఎక్స్చేంజీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి బిలియనీర్ అయ్యాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత 2022 సంవత్సరంలో బిలియన్లు కోల్పోయి బికారీ అయ్యానని సామ్ బ్యాంక్‌మన్ ప్రకటించాడు. దీంతో FTX క్రిప్టో ఎక్స్చేంజీలో పెట్టుబడి పెట్టినవాళ్లు, లావాదేవీల కోసం డిపాజిట్లు చేసినవాళ్లు కలవరానికి గురయ్యారు. వారి ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన అమెరికా దర్యాప్తు సంస్థలు.. గతేడాదే సామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్‌ను అరెస్టు చేశాయి. సామ్ బ్యాంక్‌మన్ తన FTX క్రిప్టో ఎక్స్చేంజీకి సంబంధించిన డబ్బులను మనీలాండరింగ్ చేశాడని ఏడాది పాటు నిర్వహించిన విచారణలో తేల్చాయి. ఈనివేదిక ఆధారంగా FTX క్రిప్టో ఎక్స్చేంజీ ఛీటింగ్ వ్యవహారంలో సామ్ బ్యాంక్‌మన్ దోషే అని న్యూయార్క్‌లోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం గురువారం నిర్ధారించింది. సామ్ బ్యాంక్‌మన్ రూ.90వేల కోట్ల మేర.. FTX క్రిప్టో ఎక్స్చేంజీ పెట్టుబడిదారులను, కస్టమర్లను మోసం చేశాడని న్యాయస్థానం వెల్లడించింది. ఈక్రమంలో తాను ఎలాంటి మోసం చేయలేదని సామ్ బ్యాంక్‌మన్ తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు.
We’re now on WhatsApp. Click to Join.
మోసం, మనీలాండరింగ్ అభియోగాలతో సామ్ బ్యాంక్‌మన్‌పై నమోదైన కేసు విచారణ దాదాపు గత నెల రోజుల నుంచి కంటిన్యూగా కొనసాగింది. తాజాగా గురువారం దీనిపై కోర్టు తీర్పు ఇస్తూ.. సామ్ బ్యాంక్‌మన్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో బ్యాంక్‌మన్‌కు చెందిన ముగ్గురు సహచరులను కూడా దోషులుగా తేల్చింది. బ్యాంక్‌మన్ మాజీ స్నేహితురాలు కరోలిన్ ఎల్లిసన్ తన శిక్షను తగ్గించుకోవడానికిగానూ అప్రూవర్‌గా మారిపోయి .. బ్యాంక్‌మన్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. త్వరలో కోర్టు దోషులందరికీ శిక్షను ఖరారు చేయనుంది. అమెరికా చట్టాల ప్రకారం బ్యాంక్‌మన్‌కు దాదాపు 10 సంవత్సరాలకుపైగా జైలుశిక్ష పడుతుందని (Crypto King – Fraud) అంచనా వేస్తున్నారు.