Site icon HashtagU Telugu

CM Revanth : ఇందిర‌మ్మ రాజ్యంలో.. రేవంత్ రెడ్డి కుటుంబ పాల‌న – బాల్క సుమన్

Balkasuman Revanth

Balkasuman Revanth

కేసీఆర్ (KCR) అధికారంలో ఉన్నప్పుడు పదే పదే తెలంగాణ లో కేసీఆర్ కుటుంబ పాలనా కొనసాగిస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..ఇప్పుడు తన హయాంలో చేస్తుంది ఏంటి అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన సోద‌రులు తిరుప‌తి రెడ్డి, కొండ‌ల్ రెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిలను రాష్ట్రం మీదికి వదిలారని సుమన్ పేర్కొన్నారు. అన్న‌ద‌మ్ముళ్ల‌కు ఏమైన ప‌ద‌వులు ఉన్నాయా..? ప్ర‌జాప్ర‌తినిధులా..? అధికారిక హోదా ఏమైనా ఉందా..? అలాంటివి కూడా ఏం లేవు. కానీ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వికారాబాద్ జిల్లా అభివృద్ధి స‌మీక్ష‌కు సంబంధించిన అధికారిక స‌మావేశంలో రేవంత్ సోద‌రుడు తిరుప‌తి రెడ్డి వేదిక‌పై కూర్చున్నాడు. ఇదే తిరుప‌తి రెడ్డికి ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగ‌ల్‌లో క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొని వేదిక‌పై కూర్చున్నాడు. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలను ప‌క్క‌న‌పెట్టి ఆయ‌న క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేశాడు అని బాల్క సుమ‌న్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి.. స్వ‌చ్ఛ్ బ‌యో అనే ఓ కంపెనీతో వెయ్యి కోట్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలంగాణ సీఎంవో అధికారికంగా ట్వీట్ చేస్తూ వెల్ల‌డించింది. ఈ కంపెనీ భాగ‌స్వామి ఎవ‌రంటే సీఎం సోద‌రుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిది. ఈ కంపెనీ 15 రోజుల కింద‌ట పుట్టింది. 15 రోజుల కింద పుట్టిన ఈ కంపెనీ తెలంగాణ‌లో వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు ఎలా పెడుతుంది..? ఇక్క‌డ ఒప్పందం జ‌రిగితే మీడియా ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంద‌ని చెప్పి అమెరికా వేదిక‌గా ఒప్పందం చేసుకున్నారు. 500 మందికి ఉద్యోగాలు క‌ల్పించి, తెలంగాణ సుస్థిర అభివృద్ధికి ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని ఈ కంపెనీ ప్ర‌క‌టించ‌డం సిగ్గుచేటుగా ఉంద‌న్నారు.

ఇక మరో సోదరుడు కొండ‌ల్ రెడ్డి ఏకంగా ఓ బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లడం ఏంటి..? వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డిని ప‌క్క సీట్లో కూర్చోబెట్టి.. కొండ‌ల్ రెడ్డి మ‌ధ్య సీట్లో కూర్చున్నాడు. ఏ హోదాలో కొండ‌ల్ రెడ్డి ఆస్ట్రేలియాకు బృందాన్ని తీసుకొని వెళ్లిండు. వంద‌లాది కార్ల కాన్వాయ్‌తో కామారెడ్డి, కొడంగ‌ల్, షాద్‌న‌గ‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2+2 గ‌న్‌మెన్ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు..? అని సుమన్ ప్రశ్నించారు. ఇలా తన సోదరులకు అన్ని కల్పిస్తూ..మంత్రులకు , ఎమ్మెల్యేలను పరువు తీస్తున్నారని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..? అని ప్రశ్నించారు.

Read Also : Rahul Gandhi : వయనాడ్ ఘటనను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి