Earthquakes: హిమాలయాలను కుదిపేసే భారీ భూకంపాలు పొంచి ఉన్నాయా?

భారతదేశంలో, నేపాల్‌లోనూ నవంబరు 9 బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలు హఠాత్తుగా మేల్కొని ఇళ్లు విడిచి బయటకు పరుగులు తీశారు.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 12:05 PM IST

భారతదేశంలో, నేపాల్‌లోనూ నవంబరు 9 బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలు హఠాత్తుగా మేల్కొని ఇళ్లు విడిచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇళ్లలో భూమి అదరడం, ఫ్యాన్‌లు, బెడ్‌లు ఊగడం, వాటర్ బాటిళ్లు అదరడం చూసిన ప్రజలకు ఒక్క క్షణం ఏమీ అర్థంకాలేదు. నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తరాఖండ్‌ లలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

నేపాల్‌లో ఆరుగురు మరణించారు. ఢిల్లీలో ప్రకంపనల వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ భారీ విధ్వంసం 2015 ఏప్రిల్ లో నేపాల్ లో సృష్టించిన భూకంపాన్ని గుర్తుచేసింది. నాడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వారి ఇళ్లను కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి ఘటనలు భూకంపాలపై తరచుగా అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

హిమాలయాలకు మరో భారీ భూకంప ప్రమాదం పొంచిఉందా?

హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని బుధవారం శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండో – యురేషియన్ ప్లేట్‌ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాలు ఆవిర్భవించాయని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ చెప్పారు. ఇండియన్ ప్లేట్‌పై యురేషియన్ ప్లేట్ ల స్థిరమైన ఒత్తిడి కారణంగా, దాని కింద పేరుకుపోయిన శక్తి భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంటుందని పాల్ తెలిపారు.

“హిమాలయాల కింద సమీక‌ృతమైన అధిక శక్తి చేరడంతో భూకంపాలు సంభవించడం ఒక సాధారణ ప్రక్రియ అని, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుందని కూడా చెబుతున్నారు. హిమాలయ ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురవుతుందని, భారీ భూకంపం సంభవించే బలమైన అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని పాల్ చెప్పారు. భవిష్యత్తులో వచ్చే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏడు లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. అయితే, సమీక‌ృతమైన అధిక శక్తి విడుదలతో సంభవించే భూకంప తీవ్రతను ఊహించలేమని పాల్ చెప్పారు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది ఒక క్షణం లేదా వచ్చే నెల లేదా 100 సంవత్సరాల తర్వాత కూడా జరగవచ్చని తెలిపారు.

హిమాలయాల్లో సంభవించిన భూకంపాల కాలక్రమం

హిమాలయాల్లో గతంలో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌ సరిహద్దుల్లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనలతో సహా గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. 1991లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలీలో, 2015లో నేపాల్‌లో భూకంపాలు సంభవించాయి. భూకంపాల సంభావ్యతపై ఇంతటి సమాచారం మనకు ఉన్నప్పటికీ అవి ఎప్పుడు సంభవిస్తాయో మాత్రం చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

రాబోయే భారీ భూకంపాలకు సిద్ధంగా ఉండాలి

ఇటీవల సంభవించిన భూకంపం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పాల్ నొక్కి చెబుతున్నారు. భవనాలు భూకంపాలను తట్టుకోగలిగేలా నిర్మించాలి, భూకంపాలు సంభవించే ముందు, సంభవించే సమయంలో, సంభవించిన తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే భూకంపం వల్ల సంభవించే నష్టాలను 99.99 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు.

నిత్యం భూకంపాలతో సతమతమయ్యే జపాన్ దేశ అనుభవాలను ఉటంకిస్తూ పటిష్టమైన, మెరుగైన సన్నద్ధతతో భూకంపాల కారణంగా కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలు నివారించవచ్చని పాల్ చెప్పారు. 24 గంటలూ భూకంప కదలికలను నమోదు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో దాదాపు 60 భూకంప అబ్జర్వేటరీలను ఏర్పాటు చేసినట్లు పాల్ తెలిపారు.