$4 Billion Stock: బిగ్ బుల్ ఝున్‌ ఝున్‌వాలా.. 32వేల కోట్ల గోల్డెన్ స్టాక్స్ భవితవ్యం ఏమిటి?

బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్లో పట్టిందల్లా బంగారమైంది.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 10:45 AM IST

బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్లో పట్టిందల్లా బంగారమైంది.

ఆయన ఎంపిక చేసుకున్న స్టాక్స్ రెక్కలు తొడిగిన పక్షుల్లా రివ్వున ఎగిశాయి. లాభాల వర్షాన్ని కురిపించాయి.

ఝున్‌ ఝున్‌వాలా మరణం తర్వాత.. ఆయన చేతిలో ఉండిపోయిన స్టాక్స్ పై చర్చ మొదలైంది. వాటి భవితవ్యం ఎలా ఉండబోతోంది ? అనే దానిపై డిస్కషన్ జరుగుతోంది.

చనిపోయే సమయానికి ఝున్‌ ఝున్‌వాలా వ్యక్తిగత పోర్ట్ ఫోలియోలో 32 కంపెనీలకు చెందిన దాదాపు రూ.32వేల కోట్లు (4 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ ఉన్నాయని ఒక అంచనా.

ఈ కంపెనీల్లో..

ఝున్‌ ఝున్‌వాలా స్టాక్స్ జాబితాలో టైటాన్‌, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, ఫుట్‌వేర్ మేకర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్, ఆటోమేకర్ టాటా మోటార్స్ లిమిటెడ్,ఐటి సంస్థ ఆప్టెక్ లిమిటెడ్, వీడియోగేమ్ మేకర్ నజారా టెక్నాలజీస్‌ కంపెనీలు ఉన్నాయి. కేవలం టైటాన్‌లోనే ఆయనకు రూ.11,000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. స్టార్‌ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌లో రూ.10,000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. జున్‌జున్‌వాలా స్టార్ హెల్త్, ఐటి సంస్థ ఆప్టెక్ లిమిటెడ్, వీడియోగేమ్ మేకర్ నజారా టెక్నాలజీస్‌లో 10% కంటే ఎక్కువ వాటాలను కలిగి ఉన్నారు. అయితే ఈ మొత్తం స్టాక్ హోల్డింగ్స్ క్రయవిక్రయాలపై ఝున్ ఝున్ వాలా కుటుంబం, ఆయన ట్రేడింగ్ టీమ్ ఏ విధమైన వ్యూహాలను అనుసరిస్తుంది ? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

RARE ఎంటర్‌ప్రైజెస్‌లో భాగస్వామి..

విజయవంతమైన పెట్టుబడి సూత్రాలకు చిరునామాగా మారిన ఝున్‌జున్‌వాలా ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన మార్కెట్ వాయిస్‌లలో ఒకరుగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల సమూహంలో ఆయనను గుడ్డిగా ఫాలో అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. RARE ఎంటర్‌ప్రైజెస్‌లో భాగస్వామి అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 5.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. భారతదేశపు అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడిదారుగా గుర్తింపు పొందారు. దీర్ఘకాల హోల్డింగ్ కోసం స్టాక్‌లను ఎంచుకునే పెట్టుబడిదారుగా మాత్రమే కాకుండా వ్యాపారిగా కూడా తెలివైనవాడు. యూఎస్ గ్రోత్‌‌పై వారెన్‌‌ బఫెట్ ఎలా నమ్మకముంచారో అలానే రాకేష్ జున్‌‌జున్‌‌ వాలా కూడా ఇండియా గ్రోత్‌‌ స్టోరీని ఎక్కువగా నమ్మారు. స్టాక్ మార్కెట్‌‌లు పడుతున్నా.. దేశం వృద్ధి బాట పడుతుందని, మార్కెట్‌‌ మళ్లీ లేస్తుందని ఎక్కువగా నమ్మేవారు.  అందుకే ఆయనను ‘ఇండియన్ వారెన్ బఫెట్’ అని పిలిచేవారు.

1985లో 5000 పెట్టుబడితో..

ఝున్ ఝున్ వాలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ రూ.5.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 1986లో టాటా టీ షేర్‌ల కొనుగోలు ద్వారా తాను మొదటి సారి భారీ లాభాలను ఆర్జించారు.  ఆయన టాటా టీ 5,000 షేర్లను కేవలం 43 రూపాయలకు కొన్నారు. తరువాత మూడు నెలల్లో ఆ స్టాక్ 143 రూపాయలకు పెరిగింది. దీంతో మూడు రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ తర్వాత మూడేండ్లలో ఝున్‌ఝున్‌వాలా రూ.20 నుంచి రూ.25 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ. 45 వేల కోట్లుగా ఉంది.