Site icon HashtagU Telugu

Indigo Video: యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ స్వాగతం, తోటి ప్రయాణికులు చప్పట్లు

Indigo Vs Air India

Indigo Vs Air India

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడిన యుద్ధ వీరుడికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అపూర్వ స్వాగతం పలికింది. పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో విమానం టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ కెప్టెన్‌ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ చేశారు. విమానంలో మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది.

భారత చరిత్రలో ఇప్పటివరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు అని కెప్టెన్‌ చెప్పడంతో తోటి ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను అభినందించారు. 1999 జులై 4న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ 13వ బెటాలియన్‌ సభ్యుడిగా ఉన్న సంజయ్‌ కుమార్‌ కార్గిల్‌ యుద్ధంలో తీవ్రంగా పోరాడారు. శత్రువుల దాడిలో ఆయన ఛాతీపై రెండు బులెట్లు దూసుకెళ్లాయి.  ముంజేతిపైనా బులెట్‌ గాయమైంది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు.

శరీరం నుంచి రక్తం ధారలై కారుతున్నా.. శత్రువుల బంకర్‌లోకి వెళ్లి పాక్‌ సైనికులను హతమార్చారు అని కెప్టెన్‌ ఆయన సేవలను కొనియాడారు. ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను గౌరవించగా.. ఇండిగో సిబ్బంది చిరు కానుకను అందించి ఆయనను సత్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.