Site icon HashtagU Telugu

Pragyan Rover Detects Oxygen : చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఆక్సిజన్‌ ఉన్నట్లు కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్

Sleep Mode

Pragyan rover detects oxygen

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్..అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అల్యూమినియం(AI), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం(Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్(Si)తో పాటు ఆక్సిజన్ (O) ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో ప్రకటించింది. రోవర్లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం హైడ్రోజన్ కోసం శోధన జరుగుతోందని ఇస్రో (ISRO) ట్వీట్ చేసింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగిన తొలి దేశంగా రికార్డ్ సృష్టించిన భారత్, ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాల అన్వేషణలో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) చంద్రుడిపై దిగగా, అనంతరం విక్రమ్ నుంచి వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) చంద్రుడి (Moon) ఉపరితలంపై నడక ప్రారంభించింది. కాగా ఆదివారం ప్రజ్ఞాన్ రోవర్ పెను ప్రమాదం (Pragyan Rover Escapes Massive Danger ) నుండి బయటపడింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల వ్యాసం ఉన్న గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. ఇస్రో సూచనలు అనుసరించి దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం మొదలుపెట్టింది. గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా, ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్ కు సంకేతాలు పంపింది. దీంతో పెను ప్రమాదం నుండి బయటపడింది. ప్రస్తుతం జాబిల్లి ఫై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం సాఫీగా కొనసాగుతుంది.