Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో దాదాపు 47 ఏళ్లుగా అమల్లో ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ప్రాంతీయంగా ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు “లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్, 2026” పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో 1979 నాటి పాత చట్టం రద్దయి, దీవుల్లో మద్యం అమ్మకాలకు మార్గం సుగమమైంది.
ఎందుకీ మార్పు?
లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు కేవలం కొన్ని రిసార్ట్‌లకు మాత్రమే పరిమితమైన మద్యం లభ్యతను ఇతర పర్యాటక ప్రదేశాలకు విస్తరించడం ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఎక్సైజ్ సుంకాలు, లైసెన్స్ ఫీజుల రూపంలో కేంద్రపాలిత ప్రాంతానికి ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులను స్థానిక అభివృద్ధికి వినియోగిస్తారు. సంపూర్ణ నిషేధం స్థానంలో మద్యం తయారీ, దిగుమతి, రవాణా, అమ్మకాలపై పర్యవేక్షణ కోసం ఒక క్రమబద్ధమైన, చట్టపరమైన వ్యవస్థను ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?
నివేదికల ప్రకారం, లక్షద్వీప్‌లో మద్యం మార్కెట్‌ను స్వేచ్ఛగా కాకుండా, ప్రభుత్వ పూర్తి నియంత్రణలో ఉంచనున్నారు. మద్యంపై భారీగా పన్నులు విధించారు. దేశీయంగా తయారైన విదేశీ మద్యం (IMFL), దిగుమతి చేసుకున్న మద్యంపై 400%, బీర్‌పై 200%, వైన్‌పై 80% ఎక్సైజ్ సుంకం విధించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, అధీకృత ఏజెన్సీలు, ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థలకు మాత్రమే మద్యం అమ్మకాలకు లైసెన్సులు జారీ చేస్తారు. 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మడం లేదా వారు కొనుగోలు చేయడంపై కఠిన నిషేధం కొనసాగుతుంది. అవసరమైతే దీవుల్లోని ఏ ప్రాంతంలోనైనా మళ్లీ నిషేధం విధించే అధికారాన్ని అడ్మినిస్ట్రేటర్‌కు కల్పించారు.
నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షద్వీప్ జనాభాలో సుమారు 96.5% ముస్లింలు ఉన్నారు. ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా 1979లో ఇక్కడ మద్యపాన నిషేధం విధించారు. ఇప్పుడు మద్యం అమ్మకాలకు అనుమతించడం తమ సంస్కృతి, జీవనశైలిని దెబ్బతీయడమేనని స్థానిక ప్రజలు, ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి. స్థానిక ప్రజలతోగానీ, ప్రజాప్రతినిధులతోగానీ సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ హమ్దుల్లా సయీద్ సహా పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం సులభంగా అందుబాటులోకి వస్తే యువత వ్యసనాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందని, ప్రశాంతమైన దీవుల్లో నేరాలు పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.