Supreme Court: న్యాయమూర్తిగా గే లాయర్!.. కొలీజియం సిఫారుసుకు కేంద్రం ఆమోదం చెప్పేనా?

దేశంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఉన్న లింగ భేదాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 09:05 PM IST

Supreme Court: దేశంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఉన్న లింగ భేదాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అన్ని రంగాలు అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఓ గే లాయర్ ను న్యాయమూర్తిని చేయాలని సిఫారుసు చేసింది. అయితే గతంలో రెండుసార్లు ఇలానే సిఫారుసు చేసినా కేంద్రం మాత్రం దీనిని పెండింగ్ లో ఉంచగా.. సుప్రీంకోర్టు తొలిసారి ఈ అంశంలో గే లాయర్ పేరును బహిర్గతం చేయడంతో పాటు కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను కూడా బయటపెట్టింది.

న్యాయమూర్తుల నియామకం మీద కొలీజయం కేంద్రానికి సిఫారుసులు చేయడం.. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం తిరిగి కొలీజియంకు పంపడం, వాటిపై కొలీజియం వివరణ ఇవ్వడం జరుగుతుంది. అయితే గే అడ్వకేట్ ను న్యాయమూర్తిగా నియమించాలని గతంలో రెండుసార్లు కొలీజియం సిఫారుసు చేసినా.. రెండు కారణాలను చూపుతూ దీనిని పెండింగ్ లో పెట్టింది.

గే లాయర్ సౌరభ్ కిర్పాల్ ని న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. అయితే దీనిపై కేంద్రం రెండు అభ్యంతరాలను లేవనెత్తింది. అభ్యర్థి గే అని ఒక అభ్యంతరాన్ని లేవనెత్తిన కేంద్రం, సదరు అభ్యర్థి పార్ట్ నర్ స్విట్జర్లాండ్ పౌరుడని అభ్యంతరం తెలిపింది. లింగం ఆధారంగా వివక్ష చూపడం సరి కాదన్న కొలీజియం.. గే లాయర్ పార్ట్ నర్ వల్ల దేశభద్రతకు ముప్పులేదని, పైగా స్విట్జర్లాండ్ భారతదేశానికి మిత్రదేశమే అని పేర్కొంది. చాలామంది పార్ట్ నర్లు వేరే దేశాలకు చెందిన వారు ఉన్నా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని వివరించింది.

సాధారణంగా అయితే కొలీజియం సిఫారసు చేసిన వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, అభ్యంతరాలను సుప్రీంకోర్టు బయటకు వెల్లడించదు. కానీ తొలిసారి సుప్రీంకోర్టు వివరాలను వెల్లడిస్తూ మరోసారి గే లాయర్ సౌరభ్ కిర్పాల్ పేరును సిఫారసు చేసింది. కాగా గే లాయర్ సౌరభ్ పేరును మూడోసారి సిఫారసు చేస్తూ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్ లు సంతకం పెట్టిన లేఖను ఈసారి కేంద్రానికి సమర్పించడం జరిగింది. ఒకవేళ ఈ విషయంలో కేంద్రం అనుకూలంగా స్పందిస్తే మాత్రం తొలిసారి గే లాయర్ న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.