Section 49 – Chandrababu Bail : టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై సెక్షన్ 409ను నమోదు చేయడం వల్లే సీఐడీ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయగలిగారనే చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ అభియోగాన్ని మోపినంత మాత్రాన సరిపోదని, ఆ అరెస్ట్‌కు గల కారణాలను వివరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో చంద్రబాబు లబ్ధి పొందారని సీఐడీ బలమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనేపథ్యంలో అంతటా సెక్షన్ 409పై చర్చ జరుగుతోంది.
Also read : Chandrababu Arrest: పవన్ ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే
సెక్షన్ 409 అంటే.. చంద్రబాబుకు అప్లై అవుతుందా ?
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం.. ప్రభుత్వోద్యోగి, బ్యాంకర్, వ్యాపారి, న్యాయవాది వంటి వృత్తులవారు ఆస్తుల అప్పగింతల వ్యవహారాల్లో నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడితే జీవిత ఖైదు లేదా పది సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు జరిమానాకు అర్హులు అవుతారు. ఈ సెక్షన్ కింద ఒకవేళ ఏపీ సీఐడీ చంద్రబాబును కస్టడీకి ఇవ్వమని కోర్టును అడిగితే దానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఇదే అంశంపై వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన కోర్టును కోరారు. 409 సెక్షన్ ను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. పోలీస్ కస్టడీ అవసరం లేదని కోర్టు భావిస్తే.. చంద్రబాబుకు జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా.. చంద్రబాబు వెంటనే ఈరోజే హైకోర్టులో బెయిల్‌కు అప్లై చేసుకొనే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.