ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ (NTR Bharosa Pension Scheme) ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పింఛన్ల పంపిణీలో అనుసరించాల్సిన నియమాలను మరింత కఠినతరం చేశారు. ఈ మార్పుల ద్వారా లబ్ధిదారులకు సరైన సమయంలో, వారి నివాసం వద్దే పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటి వరకు కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లకుండా, ఒకే చోట కూర్చుని పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది లబ్ధిదారులు ఇతర గ్రామాల్లో ఉంటూ అక్కడే పింఛన్ తీసుకుంటున్నారని గుర్తించారు. దీంతో ఇకపై ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి పింఛన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు 50 ఇళ్ల పరిధిలో పింఛన్లను పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం, ముగ్గురు వాలంటీర్ల పరిధిలోని లబ్ధిదారులను ఒక క్లస్టర్‌గా చేసి, గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతి క్లస్టర్‌లో 60 నుంచి 120 మంది వరకు లబ్ధిదారులు ఉంటున్నారు. అయితే ఈ విధానం కొంత భారంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా అమలవుతోందని అధికార వర్గాలు అంటున్నాయి.
Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్
సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం సర్వే చేయించింది. ఈ సర్వేలో లబ్ధిదారుల ఇంటి జియో కోఆర్డినేట్స్‌ను నమోదు చేసి, ఆ ఇంటికే వెళ్లి పింఛన్ అందించేలా యాప్‌లో మార్పులు చేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి వద్ద కాకుండా మరోచోట పింఛన్ పంపిణీ చేస్తే, యాప్‌లో ఆ వివరాలు నమోదవుతాయి. అదే జరిగితే సంబంధిత ఉద్యోగి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు తరచుగా వేరే చోట పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రుల్లో ఉన్నవారు, ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారు ముందుగా తమ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ మరింత క్రమబద్ధమైనదిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.