విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు.
మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలను ఓదార్చి, గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, మంత్రుల పర్యటన సందర్భంగా కేజీహెచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. “బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. వారి కుటుంబాలకు జీవితాంతం తోడుగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూడా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… “మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు, బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా ఇచ్చి అండగా నిలబడటానికి వచ్చాం” అని స్పష్టం చేశారు.
మరోవైపు, మృతదేహాల గుర్తింపు కష్టంగా మారడంతో డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో భద్రతా లోపాలు, బాధ్యులెవరిపై అనే అంశాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది.
