Jyothi Yarraji : చైనాలోని చెంగ్డూ వేదికగా జరుగుతున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో తెలుగు యువకెరటం జ్యోతి యర్రాజీ సత్తా చాటింది.
ఈ గేమ్స్ లో మన దేశానికి హర్డిల్స్ రన్నింగ్ విభాగంలో మొట్టమొదటి పతకాన్ని అందించింది.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రన్నింగ్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
Also read : Onion Prices: సామాన్యులకు మరో షాక్.. ఆగస్టు చివరి నాటికి పెరగనున్న ఉల్లి ధరలు..?
ఈ విభాగానికి సంబంధించిన ఫైనల్ రేసులో 23 ఏళ్ళ జ్యోతి యర్రాజీ 12.78 సెకన్లలో 100 మీటర్ల హర్డిల్స్ ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో 2022 అక్టోబర్ లో తాను నమోదు చేసిన 12.82 సెకన్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఇక స్లోవేకియా క్రీడాకారిణి విక్టోరియా ఫోర్‌స్టర్ 12.72 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి స్వర్ణం సాధించగా, చైనాకు చెందిన యాన్నీ వు 12.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజతం సాధించింది.
మన దేశానికి చెందిన స్ప్రింటర్ అమ్లాన్ బోర్గోహైన్ కూడా పురుషుల 200 మీటర్ల పరుగులో 20.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని దక్కించున్నాడు. 200 మీటర్ల పరుగులో దక్షిణాఫ్రికాకు చెందిన త్సెబో ఇసాడోర్ మత్సోసో 20.36 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, జపాన్‌కు చెందిన యుదై నిషి 20.46 సెకన్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు 11 స్వర్ణాలు, ఐదు రజతాలు, 9 కాంస్య పతకాలను గెల్చుకుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో ఉండగా, కొరియా, జపాన్ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి.